https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/30/Locust.jpg?itok=fbIyu7es

మధ్యప్రదేశ్‌ వైపు మిడతల దండు! 



సాక్షి, హైదరాబాద్‌: మిడతల దండు మధ్యప్రదేశ్‌ వైపు మరలిపోతుందని తెలంగాణ వ్యవసాయ శాఖ, విపత్తు నిర్వహణ శాఖ అధికారులు అంచనా వేశారు. జోధాపూర్‌ లొకస్ట్‌ వార్నింగ్‌ సెంటర్‌ అధికారులు సమాచారం ఇచ్చారని చెబుతున్నారు. మహారాష్ట్ర నాగ్‌పూర్‌లోని రాంటెక్‌ నుంచి దిశ మార్చుకుని, మధ్యప్రదేశ్‌ వైపు ప్రయాణిస్తోందని పేర్కొంటున్నారు. వాస్తవంగా మిడతల దండు ఛత్తీస్‌గఢ్‌ వైపు వెళ్తుందని అంచనా వేసినా.. ఇప్పుడు అటు వెళ్లట్లేదని చెబుతున్నారు. గాలి దిశకు అనుగుణంగా మళ్లీ పైకి వెళ్తున్నట్లు సమాచారం అందినట్లు తెలిపారు. మన సరిహద్దులకు దగ్గరగా మిడతల దండు వచ్చినా.. ప్రస్తుతానికి దిశ మార్చుకోవడంతో రైతులు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఒకవేళ గాలి దిశ మారితే, మళ్లీ ఇటువైపు వస్తుందా లేదా అనేది ఇప్పుడే చెప్పలేమంటున్నారు. 90 శాతం వరకు ఇటు వచ్చే అవకాశాలు లేవని స్పష్టం చేస్తున్నారు.

రామగుండానికి వెళ్లిన కమిటీ సభ్యులు..
రాజస్తాన్‌ వంటి రాష్ట్రాల్లో సాధారణంగానే మిడతల వల్ల ప్రతిసారి కొంతమేర పంట నష్టం సంభవి స్తుంది. అయితే అవి ఇతర రాష్ట్రాలకు వస్తుండటం వల్ల పరిస్థితి మారిందని విశ్లేషిస్తున్నారు. అందుకే మిడతల దండును సరిహద్దుల్లోనే సంహరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఐదుగురితో కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఒకవేళ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని జయశంకర్‌ భూపాలపల్లి, మంచి ర్యాల జిల్లాల నుంచి అటవీ ప్రాంతంలోకి ప్రవేశిస్తే నష్టం అధికంగా ఉండే అవకాశం ఉన్నందున ముందస్తుగా కమిటీ సభ్యులను ముగ్గురిని రామగుండానికి పంపినట్లు వ్యవసాయ, విపత్తు నిర్వహణ శాఖల చెబుతున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలోకి మిడతల దండు రానందున ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. కాగా, ఒకవేళ మిడతల దండు రాష్ట్రంలోకి ప్రవేశిస్తే అడ్డుకునేందుకు మహారాష్ట్ర సరిహద్దు జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో వెయ్యి లీటర్ల చొప్పున 7 వేల లీటర్ల రసాయనాలు సిద్ధంగా పెట్టుకున్నారు.