https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/30/555.jpg?itok=6CPuHcbj

10న రాష్ట్రానికి నైరుతి

సాక్షి, విశాఖపట్నం/హైదరాబాద్‌: నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, జూన్‌9, 10 తేదీల్లో తెలుగు రాష్ట్రాలను పలకరించనున్నాయని విశాఖ వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.  నైరుతి ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలకు, మాల్దీవులు, కొమోరిన్‌ ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయి. అలాగే 48 గంటల్లో ఆగ్నేయ, నైరుతి బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీంతో జూన్‌ 1వ తేదీకి కేరళ తీరాన్ని తాకనున్న రుతుపవనాలు.. జూన్‌ 9, 10 తేదీల్లో తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించనున్నట్లు తెలిపారు.

ఆగ్నేయ అరేబియా సముద్రం, దాన్ని ఆనుకొని ఉన్న తూర్పు మధ్య అరేబియా సముద్రంలో ఈ నెల 31న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది ఏర్పడిన తర్వాత.. నైరుతి పవనాలు మరింత వేగంగా కదలనున్నాయని అధికారులు తెలిపారు. మరోవైపు దక్షిణ తమిళనాడు, తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో నేడు, రేపు కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో రానున్న రెండు రోజుల పాటు 41 నుంచి 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదుకానున్నాయి.