
విప్రో కొత్త సారథిగా థియెరీ డెలాపోర్ట్
న్యూఢిల్లీ: కొంత కాలంగా వృద్ధి పరంగా సమస్యలను ఎదుర్కొంటున్న ఐటీ రంగ దిగ్గజం విప్రో కొత్త సారథిని ఎంపిక చేసుకుంది. క్యాప్‌జెమినీలో సుదీర్ఘకాలం పనిచేసిన థియెరీ డెలాపోర్ట్.. నూతన సీఈవో, ఎండీగా జూన్ 6 నుంచి బాధ్యతలు స్వీకరిస్తారని విప్రో నుంచి శుక్రవారం ప్రకటన వెలువడింది. ప్రస్తుతం ఈ బాధ్యతల్లో ఉన్న అబిదాలి జెడ్ నీముచ్‌వాలా జూన్ 1న తప్పుకోనున్నారు. అప్పటి నుంచి డెలాపోర్ట్ బాధ్యతలు చేపట్టే వరకు రోజువారీ కార్యకలాపాలను చైర్మన్ రిషద్‌ప్రేమ్‌జీ చూస్తారని విప్రో తెలిపింది. పోటీ సంస్థ ఇన్ఫోసిస్‌కు సీఈవోగా వ్యవహరిస్తున్న సలీల్ పరేఖ్ కూడా అంతకుపూర్వం క్యాప్‌జెమినీ ఎగ్జిక్యూటివ్ కావడం గమనార్హం. పోటీ సంస్థలు టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌తో పోల్చుకుంటే విప్రో వృద్ధి పరంగా వెనకబడిన తరుణంలో ఈ నూతన నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది.