https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/30/KRMR.jpg?itok=FeVl_0zf

కరోనా అనుమానం.. పేగుబంధానికి దూరం



కరీంనగర్‌ టౌన్‌: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ ఇప్పుడు కుటుంబాల్లో చిచ్చుపెడుతోంది. నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లిని సైతం దూరం చేసుకునే పరిస్థితిని కల్పించింది. కరోనా అనుమానంతో కన్న తల్లిని కూడా ఇంట్లోకి రావొద్దని కొడుకు అడ్డుకున్న సంఘటన కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నగరంలోని కిసాన్‌ నగర్‌లో నివాసముండే కట్ట శ్యామల (80)కు నర్సింహాచారి, ఈశ్వరాచారి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈశ్వరాచారి మరోచోట అద్దెకు ఉంటుండగా, పెద్ద కొడుకు నర్సింహాచారితో కలసి శ్యామల జీవిస్తోంది. మార్చిలో లాక్‌డౌన్‌కు ముందు సమీప బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండటంతో శ్యామల మహారాష్ట్రలోని షోలాపూర్‌కు వెళ్లింది.

తర్వాత లాక్‌డౌన్‌ విధించడంతో అక్కడే చిక్కుకుపోయింది. ఇటీవల లాక్‌డౌన్‌ సడలింపులు, రవాణా వ్యవస్థ పునరుద్ధరణతో బంధువులు ఆమెను రైలులో పంపించారు. గురువారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్న శ్యామల.. శుక్రవారం తెల్లవారు జామున కరీంనగర్‌లోని తన ఇంటికి చేరింది. తల్లి రాకను గమనించిన కుమారుడు, అతని భార్య అడ్డుకున్నారు. ‘నీకు కరోనా వచ్చిందనే అనుమానం ఉంది. ఇంట్లోకి రావొద్దు’అని వారించారు. ఇంట్లో పిల్లలు ఉన్నారని వారికీ కరోనా సోకే ప్రమాదం ఉందని గేటు మూసేశారు. దీంతో ఆ వృద్ధురాలికి ఏం చేయాలో తోచక గేటు ఎదుటే గంటల తరబడి కూర్చుండి పోయింది. చిన్న కొడుకుకు విషయం తెలిపినా అతను సైతం తల్లిని తీసుకెళ్లేందుకు నిరాకరించాడు. స్థానిక కార్పొరేటర్‌ కంసాల శ్రీనివాస్‌ వృద్ధురాలికి అల్పాహారం అందించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వృద్ధురాలికి స్క్రీనింగ్‌ నిర్వహించి కరోనా లక్షణాలు లేవని తేల్చారు. పోలీసులు వృద్ధురాలి కుమారుడికి కౌన్సెలింగ్‌ నిర్వహించారు. కొన్ని షరతులతో కుమారుడు అంగీకరించడంతో ఇంట్లోని ఒక గదిలో శ్యామలను ఉంచారు. కరోనా అనుమానంతో వృద్ధురాలిని ఇంట్లోకి రానివ్వని సంఘటన స్థానికులను కంటతడి పెట్టించింది.

 ఇంటి గేటు ఎదుట కూర్చున్న వృద్ధురాలు శ్యామలకు టిఫిన్‌ అందజేస్తున్న మున్సిపల్‌ సిబ్బంది