https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/30/infra.jpg?itok=my9c4VK3

మౌలిక పరిశ్రమలు మునక...



న్యూఢిల్లీ: మౌలిక రంగానికి సంబంధించి ఎనిమిది పారిశ్రామిక విభాగాల గ్రూప్‌ ఏప్రిల్‌లో దారుణ ఫలితాన్ని చూసింది. ఈ గ్రూప్‌లోని పరిశ్రమల ఉత్పత్తిలో (2019 ఏప్రిల్‌ ఉత్పత్తితో పోల్చి) అసలు వృద్ధిలేకపోగా –38.1 శాతం క్షీణత నమోదయ్యింది. నిజానికి మార్చిలోనే ఈ గ్రూప్‌ –9 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. కరోనా నేపథ్యంలో దేశం మొత్తం ఏప్రిల్‌లో పూర్తి లాక్‌డౌన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. దీనితో ఏప్రిల్‌లో ‘మైనస్‌’ ఫలితం మరింత తీవ్రమైంది.  2019 ఏప్రిల్‌లో ఈ గ్రూప్‌ 5.2 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది.

వాణిజ్య, పారిశ్రామిక మంత్రిత్వశాఖ శుక్రవారం ఈ గణాంకాలను విడుదల చేస్తూ,  ‘‘లాక్‌డౌన్‌ నేపథ్యంలో బొగ్గు (–15.5 శాతం), సిమెంట్‌ (–86 శాతం) , స్టీల్‌ (–83.9 శాతం), సహజ వాయువు (–19.9 శాతం), రిఫైనరీ (–24.2 శాతం), క్రూడ్‌ఆయిల్‌ (– 6.4 శాతం) వంటి రంగాల్లో ఉత్పత్తి భారీగా దెబ్బతింది’’ అని పేర్కొంది. ఈ రంగాలు కాకుండా ఇంకా విద్యుత్‌ (–22.8%), ఎరువుల (–4.5 శాతం) రంగాలు ఈ గ్రూప్‌లో ఉన్నాయి. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) సూచీలో ఈ ఎనిమిది పరిశ్రమల వాటా 40.27 శాతం. ఐఐపీ ఏప్రిల్‌ గణాంకాలు జూన్‌ రెండవ వారంలో వెలువడతాయి. తాజా ఇన్‌ఫ్రా ఫలితాల ప్రతికూల ప్రభావం మొత్తం ఐఐపీ ఏప్రిల్‌ గణాంకాలపై తీవ్రంగా పడనుంది.