https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/30/sensex.jpg?itok=WYJLURVw

9,500 పైకి నిఫ్టీ



ప్రపంచ మార్కెట్లు పతన బాటలో ఉన్నా, కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నా శుక్రవారం మన మార్కెట్‌ ముందుకే దూసుకుపోయింది. గత ఆర్థిక సంవత్సరం (2019–20) మార్చి క్వార్టర్‌ జీడీపీ గణాంకాలు విడుదల కానుండటంతో మార్కెట్లో అప్రమత్త వాతావరణం నెలకొన్నప్పటికీ,  బ్యాంక్, ఆర్థిక రంగ, ఎఫ్‌ఎమ్‌సీజీ రంగ షేర్ల జోరుతో స్టాక్‌ సూచీలు లాభపడ్డాయి. వరుసగా మూడో రోజూ సెన్సెక్స్, నిఫ్టీలు పెరిగాయి. 

విదేశీ ఇన్వెస్టర్లు గురువారం రూ.2,354 కోట్ల మేర నికర కొనుగోళ్లు జరపడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ 14 పైసలు పుంజుకొని 75.62కు చేరడం, ఉద్దీపన ప్యాకేజీ 3.0పై కసరత్తు జరుగుతోందన్న వార్తలు, లాక్‌డౌన్‌ పొడిగింపు ఉండకపోవచ్చన్న అంచనాలు సానుకూల ప్రభావం చూపించాయి.  సెన్సెక్స్‌ 224 పాయింట్ల లాభంతో 32,424 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 90 పాయింట్లు ఎగసి 9,580 పాయింట్ల వద్ద ముగిశాయి. వారం పరంగా చూస్తే, సెన్సెక్స్‌. నిఫ్టీలు భారీగా లాభపడ్డాయి. రంజాన్‌ సెలవు కారణంగా నాలుగు రోజులే జరిగిన ఈ వారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌1.752 పాయింట్లు, నిఫ్టీ 541 పాయింట్లు లాభపడ్డాయి. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు మరింతగా పెరుగుతుండటంతో ప్రపంచ మార్కెట్లు నష్టపోయాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా యూరప్‌ మార్కెట్లు 1 శాతం రేంజ్‌ నష్టాల్లో ముగిశాయి.ట

లుపిన్‌ లాభం రూ.390 కోట్లు
ఔషధ కంపెనీ లుపిన్‌ 2019–20 క్యూ4లో రూ.390 కోట్ల నికర లాభం ఆర్జించింది. 2018–19 ఇదే క్వార్టర్‌లో లాభం(రూ.290 కోట్లు)తో పోల్చితే 35% వృద్ధి సాధించింది.  ఆదాయం 3,807 కోట్ల నుంచి 3,791 కోట్లకు తగ్గింది. పన్ను వ్యయాలు రూ.294 కోట్ల నుంచి రూ.105 కోట్లకు తగ్గాయి. రూ.2 ముఖ విలువగల ఒక్కో షేర్‌కు రూ.6 డివిడెండ్‌ను ప్రకటించింది.

జుబిలంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ లాభం 260 కోట్లు
న్యూఢిల్లీ: జుబిలంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ కంపెనీ గత ఆర్థిక సంవత్సరం (2019–20) నాలుగో త్రైమాసిక కాలంలో రూ.260 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్‌)ఆర్జించింది. 2018–19 ఇదే క్వార్టర్‌లో రూ.101 కోట్ల నికర లాభం వచ్చింది. కార్యకలాపాల ఆదాయం రూ.2,386 కోట్ల నుంచి రూ.2,391 కోట్లకు పెరిగిందని కంపెనీ తెలిపింది.