మైదానం తొలగిస్తున్నారు
అజయ్ దేవగన్ హీరోగా హిందీలో తెరకెక్కుతున్న చిత్రం ‘మైదాన్’. ఫుట్‌బాల్ క్రీడాకారుడు సయ్యద్ అబ్దుల్ రహిమ్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. అమిత్ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. ప్రియమణి కథానాయిక. 1950లలో ఈ చిత్రకథ జరుగుతుంది. పీరియాడికల్ చిత్రం కాబట్టి ఈ సినిమా చిత్రీకరణ కోసం ముంబైలో 16 ఎకరాల్లో సెట్స్ వేశారు. ఇందులో ఫుట్‌బాల్ స్టేడియం సెట్ కూడా ఒకటని సమాచారం. అయితే ఈ సెట్స్‌ను ఇప్పుడు తొలగిస్తున్నారు.
కరోనా వల్ల షూటింగ్స్ అన్నీ ఆగిపోయాయి. మళ్లీ ఎప్పుడు మొదలవుతాయో ఇంకా స్పష్టత రాలేదు. జూన్ నెలలో వర్షాలు మొదలవుతాయి. దాంతో సెట్స్ పాడవుతాయనే ఉద్దేశంతో తొలగించాలనుకున్నారు. ఆల్రెడీ తొలగించే పనులు కూడా ప్రారంభమయ్యాయి. ‘‘ఈ సెట్స్ మళ్లీ నిర్మించాలంటే సుమారు రెండు నెలల సమయం పడుతుంది. షూటింగ్స్ మళ్లీ ప్రారంభం అయితే సెట్స్ మళ్లీ వేసి చిత్రీకరణ ప్రారంభించేసరికి నవంబర్ అవుతుంది’’ అని నిర్మాత బోనీ కపూర్ తెలిపారు.