బిచ్చగాడు మళ్లీ వస్తున్నాడు
తమిళ హీరో విజయ్ ఆంటోని హీరోగా శశి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పిచ్చైకారన్’. తెలుగులో ‘బిచ్చగాడు’గా అనువాదమై ఘనవిజయం సాధించింది. ఈ సినిమా విజయ్ ఆంటోనీకి తెలుగులో మంచి మార్కెట్ ఏర్పరిచింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ సిద్ధం కాబోతున్నట్టు ప్రకటించారు విజయ్ ఆంటోని. సీక్వెల్‌కి సంబంధించిన కథను ఆయనే రాస్తున్నారు. ఆల్రెడీ నాలుగు నెలలుగా ఈ కథ మీద పని చేస్తున్నట్టు తెలిపారు.
మొదటి భాగానికి దర్శకత్వం వహించిన శశి ఈ సీక్వెల్‌కి దర్శకత్వం చేయరట. ఈ సీక్వెల్‌ను నిర్మించడంతో పాటు సంగీత దర్శకత్వం కూడా వహిస్తారట విజయ్ ఆంటోని. నిజానికి ముందు సంగీతదర్శకుడిగానే ఆయన ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆ తర్వాత హీరోగా మారి, సినిమాలు చేస్తున్నారు. తాను నటించే సినిమాలను దాదాపు తానే నిర్మిస్తున్నారు కూడా. అలా నిర్మాతగా కూడా మారారు. ఇప్పుడు ‘బిచ్చగాడు’కి సీక్వెల్‌కి కథ రాస్తూ, కథారచయితగా కూడా తన ప్రతిభను నిరూపించుకోబోతున్నారు.