మనసు బంగారం
వలస కూలీల పాలిట ఆపద్భాంధవుడు అయ్యారు నటుడు, నిర్మాత సోనూ సూద్. పొట్టకూటి కోసం పట్టణానికి వచ్చి కరోనా కోరల్లో చిక్కుకున్న వందలమంది వలస కూలీలు సోనుసూద్ సాయంతో వారి స్వస్థలాలకు చేరుకుంటున్నారు. సోనూ సూద్ చేస్తున్న ఈ సాయం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా మరో మంచి పని చేశారు. కేరళలోని ఏర్నాకులంలో చిక్కుకుపోయిన దాదాపు 180 మంది అమ్మాయిలను విమానంలో వారి స్వస్థలాలకు చేర్చే ప్రయత్నం చేశారు సోను.
వీరంతా కుట్టుపనులు చేయడం కోసం కేరళ వెళ్లారు. కానీ కరోనా వల్ల ఆ ఫ్యాక్టరీ మూత పడడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. స్వస్థలాలకు వెళ్లడానికి సరైన మార్గం కనిపించకపోవడంతో ఆ అమ్మాయిలు కేరళలోనే ఇబ్బందులు పడుతున్నారు. వారి ఇబ్బందులను ఓ స్నేహితుడి ద్వారా తెలుసుకున్న సోనూ సూద్ వారిని స్వస్థలాలకు చేర్చేందుకు ఓ విమానాన్ని ఏర్పాటు చేశారు. బెంగళూరు నుంచి కేరళకు ప్రత్యేక విమానం కోసం సోనూ సూద్ సంబంధిత ప్రభుత్వ ప్రతినిధుల నుంచి అనుమతులు తీసుకున్నారు.
కొచ్చి నుంచి ఈ విమానం భువనేశ్వర్ చేరుకోనుంది. కరోనా కారణంగా లాక్‌డౌన్ అమలులోకి వచ్చినప్పటినుంచి సోను ఇలా తనకు తోచినది చేస్తూ వస్తున్నారు. ఆ మధ్య హెల్త్ కేర్ వర్కర్స్ కోసం ముంబైలోని తన సొంత హోటల్‌ను ఇచ్చారు. ‘సినిమాల్లో విలన్‌గా కనిపించినా మీరు రియల్ లైఫ్‌లో హీరో.. మీ మనసు బంగారం’ అని సోనూ సూద్ అభిమానులు ఆయన్ను అభినందిస్తున్నారు. ఇప్పటివరకూ సోనూ సూద్ అభిమానులు కానివాళ్లు కూడా ఇప్పుడు ఆయనకు ఫ్యాన్స్ అయ్యారు.