https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/30/ys-jagan.jpg?itok=0MIdLBFz

సమర్థతకూ, సంక్షేమానికి చిరునామా

అలుపెరగని పోరాటయోధుడిగా, ఇచ్చిన మాట కోసం ఎంత దూరమైనా వెళ్లడానికి సంకోచించని సాహసిగా, ఉద్యమకారుడిగా, పట్టుదలకు మారుపేరుగా జన హృదయాల్లో సుస్థిర స్థానం సంపా దించుకున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ సారథ్య బాధ్యతలు స్వీకరించి నేటికి ఏడాదవుతోంది. వేలాదిమంది సమక్షంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినరోజే తన పాలన ఎలా వుండబోతున్నదో, తన లక్ష్యాలేమిటో, ప్రాథమ్యాలేమిటో సూటిగా, స్పష్టంగా జగన్‌మోహన్‌ రెడ్డి తెలియజేశారు. ఈ ఏడాదికాలంలో వాటిని తుచ తప్పకుండా ఆచరించి చూపడం మాత్రమే కాదు...ఎప్పటికప్పుడు ఎదురవుతూ వచ్చిన సవాళ్లను సైతం అవలీలగా ఎదుర్కొని సమర్థుడైన పరిపాలకుడిగా పేరు తెచ్చుకున్నారు. పాలనలో ఎంతో అనుభవమున్న పలు వురు ముఖ్యమంత్రులను అధిగమించి మున్ముందుకు దూసుకెళ్తున్నారు. రాష్ట్రాన్ని ప్రగతిపథంలో పరుగులెత్తిస్తున్నారు. 

కొత్తగా అధికారంలోకొచ్చిన ప్రభుత్వంపై అందరి దృష్టీ వుంటుంది. అధికార పక్షం ఎన్నికల సమయంలో ఎలాంటి వాగ్దానాలు చేసిందో, వాటి విషయంలో ఏం చేస్తున్నదో అనే ఆరా సర్వ సాధారణం. అందులోనూ 151 స్థానాలు గెల్చుకున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌పై ప్రజానీకం అంచనాలు కూడా భారీగా వున్నాయి. దానికితోడు పదవీ భ్రష్టత్వం ఖాయమని నిర్ధారణకొచ్చిన టీడీపీ ప్రభుత్వం పోతూపోతూ దుష్ట చింతనతో ఖజానాను దాదాపు ఖాళీ చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా జగన్‌ తడబడలేదు. 341 రోజులపాటు రాష్ట్రమంతటా సాగించిన 3,684 కిలోమీటర్ల ‘ప్రజా సంకల్ప యాత్ర’లో తనకు తారసపడిన బాధాతప్త జీవితాల వేదనలను మరచిపోలేదు. ఆ జీవితాల చీకట్లలో వెలుగులు నింపాలన్న దృఢ సంకల్పాన్ని చెదరనీయలేదు. మేనిఫెస్టో అమలుకు అయిదేళ్ల వ్యవధి వుందన్న అలసత్వాన్ని అసలే ప్రదర్శించలేదు. ఎవరో అడిగారని కాదు, మరెవరో గుర్తు చేశారని కాదు... ప్రజలకిచ్చిన వాగ్దానాలు నెరవేర్చడమే పవిత్ర కర్తవ్యంగా ఆయన భావించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశాక చేసిన ప్రసంగం సందర్భంగా మేనిఫెస్టోను చూపుతూ... దీన్ని తాను ఖురాన్‌లా, భగవద్గీతలా, బైబిల్‌లా భావించి అందులోని వాగ్ధానాలను నెరవేర్చడానికి త్రిక రణశుద్ధిగా పనిచేస్తానని ప్రకటించారు. చెప్పినట్టే ఆ వాగ్దానాల్లో 90 శాతం అమలు చేసి అందరినీ అబ్బురపరిచారు. ఈ ఏడాదికాలంలో ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిపడిన సమస్యలేమిటో ప్రజానీకానికం తకూ తెలుసు. కరోనా వైరస్‌ మహమ్మారి విరుచుకుపడి ఆర్థిక వ్యవస్థను ఎంత కుంగదీసిందో వారికి అవగాహన వుంది. అందుకే  ప్రభుత్వం నుంచి ఎవరూ పెద్దగా ఆశించలేదు. ఈ కష్టకాలం కడతేరాక అన్నీ నెరవేరతాయని వారనుకున్నారు. కానీ మాట తప్పని, మడమ తిప్పని వారసత్వాన్ని కొనసా గిస్తూ ఎన్ని ఇబ్బందులెదురైనా ప్రతి ఒక్క హామీని నెరవేర్చడానికే జగన్‌ నిశ్చయించుకున్నారు. సమస్యలను సాకుగా చూపడం కాదు... అటువంటి సమయంలో అండగా నిలవడమే నిజమైన పాల కుడి కర్తవ్యమని భావించారు. అందుకే వివిధ సంక్షేమ పథకాల అమలుకు కేలండర్‌ రూపొందిం చుకుని, దానికి అను గుణంగా మునుముందుకు సాగుతున్నారు. 

ఏడాది వార్షికోత్సవం జరుపుకునే ఏ ప్రభుత్వమైనా ఏం చేస్తుంది? ఊరూ వాడా పార్టీ శ్రేణులను సమీకరించి జెండా ఆవిష్కరణలు జరపడం, బాణసంచా కాల్చడం, మిఠాయిలు పంచుకోవడం, స్వోత్కర్షలకు పోవడం మాత్రమే ఇన్నాళ్లూ ప్రజలు చూశారు. కానీ జగన్‌ ఈ సంస్కృతిని పూర్తిగా మార్చారు. వరసగా అయిదురోజులపాటు ‘మన పాలన–మీ సూచన’ పేరుతో తన ఏడాది పాలన పైనా, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపైనా మేధో మథనం జరపాలని నిర్ణయించారు. వచ్చే నాలు గేళ్ల పాలనలో చేపట్టాల్సిన పనులకు సంబంధించిన కార్యాచరణను ఖరారు చేసుకోవాలని తీర్మానిం చుకున్నారు. ఇందులో పథకాల లబ్ధిదారులతోపాటు, భిన్న రంగాల నిపుణులు, సమాజంలోని ప్రముఖులు పాల్గొని అభిప్రాయాలు చెప్పారు. సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ సదస్సుకు ఎంపిక చేసుకున్న అంశాలు జగన్‌ హృదయాన్ని ఆవిష్కరిస్తాయి. పాలనా వికేంద్రీకరణ, వ్యవ సాయం, అనుబంధరంగాల తీరుతెన్నులు, సాగునీరు, విద్యుత్‌ తదితర రంగాల స్థితిగతులు, విద్యా రంగంలో తీసుకొస్తున్న మార్పులు, పరిశ్రమలు, వాటికి సంబంధించిన మౌలిక వసతులు, ఆరోగ్య వ్యవస్థలో వచ్చిన, రావలసిన మార్పులు తదితరాల గురించి ప్రతిరోజూ ముఖ్యమంత్రి వివరిం చడం, అందరి సూచనలు, సలహాలు తీసుకోవడం రాష్ట్ర ప్రజలను మాత్రమే కాదు...దేశ ప్రజలను సైతం అబ్బురపరిచాయి. సదస్సులో వచ్చిన సలహాలు, సూచనలు ఎప్పటికప్పుడు స్వయంగా రాసుకోవడం, కొన్ని సందర్భాల్లో తక్షణ నిర్ణయం తీసుకోవడం, మరింత అధ్యయనం చేయాల్సి వుంటే ఆ సంగతిని అధికారులకు చెప్పడం జగన్‌ విలక్షణ శైలికి, ఆయన నిర్మాణాత్మక వైఖరికి అద్దం పట్టింది.

ఈ ఏడాదికాలంలో ప్రభుత్వానికి అడుగడుగునా అవరోధాలు సృష్టించడానికి టీడీపీ చేయని ప్రయత్నమంటూ లేదు. అన్ని వ్యవస్థలనూ ‘మేనేజ్‌’ చేయడంలో సిద్ధహస్తుడైన చంద్రబాబు ఇప్పుడు కూడా తన టక్కుటమార విద్యల్ని ప్రదర్శించడం మానుకోలేదు. ఈమధ్య ఆన్‌లైన్‌ మహా నాడు జరిపిన సందర్భంగా ఈ ఏడాదిగా పడిన కష్టాలు జీవితంలో ఎప్పుడూ పడలేదని ఆయన గారు వాపోయారు. జగన్‌ ఉక్కు సంకల్పం ముందు తనకు తెలిసిన విద్యలన్నీ బదాబదలు కావడమే బాబు ఆవేదనకు మూలం. తాను నిష్కళంకమైన, సమర్థవంతమైన పాలన అందిస్తానని జగన్‌ తొలి రోజునే వాగ్దానం చేశారు. అందుకనుగుణమైన వ్యవస్థలను నెలకొల్పి ఆ వాగ్దానాన్ని నిలుపుకు న్నారు. ఖజానాకు వందలకోట్ల రూపాయలు మిగిల్చారు. ఆత్మ విశ్వాసంతో,  ప్రజలకు మరిన్ని మంచిపనులు చేయాలన్న సంకల్పంతో రెండో సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి జనం నీరాజనాలు పడుతున్నారు.