ధోని కోరడంతోనే...
కోల్‌కతా: గతంలో ఎప్పుడూ లేనివిధంగా 2011 ప్రపంచకప్ ఫైనల్లో రెండుసార్లు టాస్ వేయాల్సి వచ్చింది. భారత స్పిన్నర్ అశ్విన్‌తో ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో సంగక్కర ఈ అంశం గురించి మాట్లాడాడు. ‘టాస్ సమయంలో వాంఖెడే స్టేడియం అరుపులతో హోరెత్తుతోంది. టాస్‌కు సంబంధించిన నేను నా ఎంపిక చెప్పాను. కానీ ధోనికి వినబడనట్లుంది. అతను వెంటనే నువ్వు టెయిల్స్ ఎంచుకున్నావా? అని నన్ను అడిగాడు. లేదు హెడ్స్ అని చెప్పాను. అప్పటికే రిఫరీ నేను టాస్ గెలిచాను అని ప్రకటించాడు. తను ఇంకా ఏం చెప్పలేదని ధోని అనడంతో అక్కడ గందరగోళం నెలకొంది. దీంతో మళ్లీ టాస్ వేయాలంటూ ధోని కోరడంతో రెండోసారి వేయగా... నేను కోరుకున్న హెడ్స్ పడింది. దీంతో మేం ముందుగా బ్యాటింగ్ చేశాం. అప్పుడు టాస్ గెలవడం అదృష్టమో కాదో తెలియదు కానీ ఒకవేళ నేను టాస్ ఓడిపోయి ఉంటే ఇండియా మొదట బ్యాటింగ్ చేసి ఉండేది. ఫలితం మరోలా ఉండేదని నేను నమ్ముతున్నా’అంటూ సంగక్కర నాటి సంగతుల్ని గుర్తు చేసుకున్నాడు.