శ్రామిక్ రైలులో విషాదం.. 5 రోజుల తర్వాత..
లక్నో: నిద్రాహారాలు లేక ఫ్లాట్‌ఫామ్‌పైనే ప్రాణాలు వదిలిన బిహార్ మహిళా వలస కూలీ ఉదంతం మరువకముందే.. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో అలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. ముంబై వలస వెళ్లిన ఓ వ్యక్తి ఇంటికి తిరుగు పయనమయ్యే క్రమంలో ప్రాణాలు విడిచాడు. ఇంకో 70 కిలోమీటర్లు చేరితే ఇల్లు చేరుతానని మురిసిన ఆ వ్యక్తి.. చివరకు రైలు టాయ్‌లెట్‌లో శవమై కనిపించాడు. అయితే, చనిపోయిన ఐదు రోజుల వరకూ అతని మృతదేహం ఎవరికంటా బయటపడకపోవడం మరో విషాదం.
(చదవండి: ఆ పదం తొలగించే అవకాశం ఉంటుందా?)
వివరాలు.. రాష్ట్రంలోని బస్తీ జిల్లాకు చెందిన మోహన్ లాల్ శర్మ (38) ముంబైలో రోజూ కూలీ చేసే కార్మికుడు. అందరిలాగే అతనికీ కరోనా లాక్‌డౌన్‌తో దుర్భర పరిస్థితులు ఎదురయ్యాయి. దాంతో శ్రామిక్ రైలులో ఇంటికి బయల్దేరాడు. అందరితోపాటు మే 23న ఝాన్సీకి చేరుకున్నాడు. అనంతరం ఝాన్సీ జిల్లా యంత్రాంగం శ్రామిక్ రైలులో వచ్చిన వారిని ఆయా ప్రాంతాలకు వెళ్లే స్థానిక రైళ్లలో ఎక్కించింది. ఈ క్రమంలో శర్మ తన బంధువొకరికి కాల్ చేసి.. తనను గోరఖ్‌పూర్ రైల్వేస్టేషన్‌లో కలుసుకోవాలని కోరాడు. అయితే, ఆ బంధువు మే 24న శర్మ ఫోన్‌కు కాల్ చేయగా.. స్విచ్డ్ ఆఫ్ వచ్చింది. గోరఖ్‌పూర్‌లో ప్రయాణికులను దించిన తర్వాత రైలు మే 27న తిరిగి ఝాన్సీకి వెళ్లిపోయింది. అదేరోజు సాయంత్రం రైల్వే కోచ్‌లు శుభ్రం చేస్తున్న క్లీనింగ్ సిబ్బంది రైలు టాయ్‌లెట్‌లో శర్మ శవం చూసి షాక్‌కు గురయ్యారు.
పై అధికారులకు సమాచారం ఇచ్చారు. ఝాన్సీలో ప్రయాణికులను దించిన తర్వాత.. టాయ్‌లెట్‌లో పడిపోయిన శర్మను ఎవరూ చూడలేదని అధికారులు తెలిపారు. శర్మకు కోవిడ్ స్క్రీనింగ్ చేసిన తర్వాతనే శ్రామిక్ రైలులో అనుమతించామని చెప్పారు. అతనికి ఆరోగ్య సమస్యలు ఉన్నట్టు వెల్లడి కాలేదని పేర్కొన్నారు. ప్రయాణ సమయంలో.. ఎవరూ అనారోగ్యంతో బాధపడుతున్న సమాచారం లేదని అన్నారు. కరోనా నిర్ధారణ పరీక్షలు చేసిన తర్వాత శర్మ మృతదేహాన్ని అతని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని పోలీసులు వెల్లడించారు. కాగా, గడిచిన రెండు నెలల్లో దాదాపు 20 లక్షల వలస కార్మికులు సొంత రాష్ట్రం ఉత్తర్‌ప్రదేశ్‌కు చేరుకున్నారు.
(చదవండి: 'ఆ ఘటన కలచివేసింది.. నిజంగా దురదృష్టకరం')