మహిళపై సింహాల దాడి
సిడ్నీ: ఆస్ట్రేలియా జూలో పని చేసే మహిళపై రెండు సింహాలు దాడి చేసిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. జూ ఆవరణను శుభ్రపరుస్తుండగా సింహాలు దాడి చేయడంతో సదరు మహిళ తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. పోలీసుల సమాచారం ప్రకారం... పారామెడిక్స్ న్యూ సౌత్ వేల్స్ (ఎన్‌ఎస్‌డబ్ల్యు) రాష్ట్రంలోని షోల్‌హావెన్ జూ లాక్‌డౌన్ కారణంగా మార్చి 25 నుంచి మూసివేశారు. ఈ నేపథ్యంలో జూ ఆవరణను బాధితురాలు శుభ్రం చేస్తుండగా సింహాలు ఆమెపై దాడి చేశాయి. ఇది గమనించిన ఇతర జూ సిబ్బంది సింహాలను గుహలోకి తరిమి ఆమెను రక్షించారు. అయితే అప్పటికే ఆమె తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు.
కాగా ఈ ఘటనలో బాధితురాలి మెడ, తల భాగంలో గాయలు కావడంతో తీవ్ర రక్తస్రావం అయ్యిందని వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు చెప్పారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు వెల్లడించారు. దీనిపై బాధిత మహిళ మాట్లాడుతూ.. ‘‘నేను గత కొంతకాలంగా జూలో పనిచేస్తున్నా. ఇలాంటి ఘటన జూలో ఎప్పుడు జరగలేదు. ఇది చాలా భయంకరమైనది’’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. జూ వద్ద హై అలర్ట్ ప్రకటించామని, ఘటనపై జూ అధికారులు ఇప్పటివరకు స్పందించలేదని పోలీసులు తెలిపారు.