రాజధాని వెన్నులో కోవిడ్-19 వణుకు
- 17,000 దాటిన పాజిటివ్ కేసులు
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీని కోవిడ్-19 వణికిస్తోంది. గడిచిన 24 గంటల్లో ఏకంగా 1106 తాజా కేసులు వెలుగుచూడటంతో ఢిల్లీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 17,000 దాటింది. హస్తినలో ఒకే రోజు వేయికి పైగా కేసులు నమోదవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. తాజాగా 13 మంది మహమ్మారి బారినపడి మరణించడంతో ఢిల్లీలో కరోనా మృతులు 398కి పెరిగాయని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్‌లు వెల్లడించారు.
ఇక 7486 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారని తెలిపారు. ఢిల్లీలో కరోనా రోగుల కోసం 21,000 బెడ్‌లు ఆస్పత్రుల్లో సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. మరోవైపు ఢిల్లీ వాసులను ఉద్దేశించి సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేస్తూ కరోనా సోకినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, హోం క్వారంటైన్‌తోనే చాలా వరకూ నయమవుతుందని, ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్ధితి వస్తే అందుకు తగిన ఏర్పాట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఎలాంటి లక్షణాలు లేకుండా లేదా స్వల్ప లక్షణాలతో ఉన్న వారు ఇంటి వద్దే కోలుకుంటారని, వారు ఆస్పత్రిలో ఉండాల్సిన అవసరం లేదని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.