https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/29/Vijay_Yadav-Serial.jpg?itok=JuRiiDpQ
డైలీ సీరియల్‌లో టీవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ నాయకుడు విజయ్‌ యాదవ్‌ (ఫైల్‌)

తెలుగు టీ​వీ వినోద పరిశ్రమ కుదేలు

కోవిడ్- 19 దెబ్బకు టీవీ వినోద పరిశ్రమ కుదేలయ్యింది. నిన్నటి వరకు తిరుగాడిన పాత్రలన్నీ ఉన్నఫలంగా అదృశ్యమయ్యాయి. అనివార్యంగా క్వారంటైన్‌కి పోయాయో? లేక భౌతిక దూరం పాటిస్తున్నాయో? ఏదేమైనా సీరియళ్లు, ఇతర వినోద కార్యక్రమాలపై ఆధారపడిన కళాకారులు, సాంకేతిక నిపుణుల జీవన చిత్రపటం చిన్నాభిన్నమయ్యింది.

భవిష్యత్ అగమ్యం?
సీరియళ్లకు అర్థం పర్థం లేని సస్పెన్సులతో, ట్విస్టులతో వీక్షకులను కట్టిపడేయాలని చూసిన టివి సిబ్బంది జీవితమే ఇప్పుడు ఊహించని మలుపులో నిలబడింది. షూటింగులు ఎప్పుడు మొదలవుతాయి? పారితోషికాల్లో కోతలు ఉంటాయా? పాత నిర్మాతల్లో పలాయనం చిత్తగించే వారు ఎందరు? ఈ విపత్కర పరిస్థితిని ఆసరాగా చేసుకుని మళ్ళీ డబ్బింగ్ సీరియళ్లను మనపై రుద్దుతారా? ఈ ప్రశ్నలు టీవీ పరివారాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి.ఫండెడ్ ప్రోగ్రామ్స్ ప్రక్రియ ప్రారంభం టీవీ సీరియళ్ల నాణ్యతకు ముప్పు తెచ్చింది. ఛానల్ హెడ్‌గా కూచున్న పెద్ద దిక్కుల దిక్కుమాలిన అభిరుచులకు, అభ్యాసాలకు విశృంఖలత్వం అబ్బింది. వాళ్ళు ఆడిందే ఆట.. పాడిందే పాటగా తయారయ్యింది పరిస్థితి. పోనీ సృజనాత్మకత ఏమైనా మెండుగా ఉన్న జీవులా అంటే అదీ లేదు. సీరియళ్లకు టైటిల్‌ పెట్టడానికి సైతం సినిమా పేర్లను ఆశ్రయించాలి. వాటిలో ఘోరమైన పరాజయం పొందిన సినిమా టైటిల్‌ను కూడా సగర్వంగా పెట్టుకుంటారు. ఈ స్థాయి వాళ్ళు కథలో, పాత్రల్లో, సంభాషణల్లో నిత్యం వేలు పెట్టడం పరిపాటి.

పిట్టను కొట్ట-పొయ్యిలో పెట్ట
డైలీ సీరియల్ అంటే నెలకు సుమారు 22 ఎపిసోడ్లు ప్రసారమవుతాయి. కనీసం ఒక నెలకు సరిపడా ఎపిసోడ్‌లు అయినా నిల్వ పెట్టుకొనే అవకాశం నిర్మాతలకు ఉండటం లేదు. ఎసరు వేశాక బియ్యం కోసం కొట్టుకు పరుగెత్తినట్లు ఉంటోంది చానళ్ళ నిర్వాకం. దీంతో కరోనా దెబ్బకు లాక్‌డౌన్ ప్రకటించే నాటికీ చానళ్ళ దగ్గర ఒక్క ఎపిసోడ్ సైతం చేతిలో నిలవలేని పరిస్థితి. తెల్లవారి నుంచి ప్రసారానికి ఎపిసోడ్లు లేక తెల్లమొఖం వేశారు. కరోనా పుణ్యమాని తెలుగు చానళ్ళ బాధ్యుల బాధ్యతారాహిత్య నిర్వాహకాలు ప్రపంచానికి తెలియవచ్చాయి. వెరసి చానళ్ళ డొల్లతనం బయట పడింది. రేపు ప్రసారం అంటే ఈ సాయంత్రం వరకు ఆమోదం తెలుపరు. కథలో ఏ మార్పులు చేస్తారో, కూర్పులో ఏ తలతిక్క ప్రదర్శిస్తారో అని భయపడటమే పరిపాటి. తలా తోక లేని మార్పులు, చేర్పులతో వేధిస్తారు. చెప్పేవాడికి వినేవాడు లోకువ అంటే ఇదే మరి. వాళ్ళ పైశాచిక ఆనందం తీర్చుకోవడమే తప్ప చానల్ తలకాయల సూచనల్లో హేతుబద్దత శూన్యం.

కన్నడ జగదేక సుందరిల దిగుమతి
కన్నడ సీమ నుంచి హీరోయిన్ల దిగుమతి తెలుగు టివి పరోశ్రమకు మరో సమస్యగా తయారయ్యింది. భాష రాని యువతులను హీరోయిన్లుగా రుద్దుతున్నారు. కర్ణాటకకు చెందిన శాల్తి అయితే చాలు. నటన రాకపోయినా పర్లేదు హడావిడిగా ముఖ్యపాత్రకు ఎంపిక చేసి విమానంలో దిగుమతి చేస్తున్నారు. సదరు నటికి తెలుగు సీనియర్ కళాకారులకన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా పారితోషికం. గౌరవం, భోజనం, వసతి అన్నిటా అగ్ర తాంబూలమే. క్వారంటైన్‌లో కరోనా రోగి మాదిరి మేపుతున్నారు. అయినవాళ్ళకు ఆకుల్లో కానీ వాళ్లకు కంచాల్లో అన్న చందాన ఉంది మన చానళ్ళ పర భాషా కళాకారిణుల వ్యామోహం. ఇది గమనించి ఆరువారాల్లో తెలుగు భాష నేర్పే సంస్థలు బెంగుళూరు నగరంలో పుట్టగొడుగుల్లా వెలిశాయి. కళాకారుల గొంతు నులిమి తెలుగు నటీనటుల విషయానికి వస్తే, ఒకరు ఒక్క సీరియల్లో మాత్రమె నటించాలనే ఆంక్ష అప్రకటితంగా అమలులో ఉంది. ఒక చానన్‌లో ఒక సీరియల్‌లో పనిచేస్తున్న నటుడిని అదే చానల్‌లో ప్రసారమవుతున్న ఇతర సీరియల్‌లో నటించడానికి అవకాశం ఇవ్వరు. దీంతోపాటు మిగతా పోటీ చానళ్ళలో అతను పనిచేయడానికి అనర్హుడు. నాలుగేళ్ళ పాటు సాగే సీరియల్‌లో కేవలం పదో పాతికో ఎపిసోడ్లలో కనిపించిన దృష్ట్యా ఆ సీరియల్ నడిచినంత కాలం రంగేసుకోకుండా చేయడం అన్యాయం కాదా? కళాకారులను తమకు చేతనైన నటనకు తద్వారా ఉపాధికి దూరం చేయడం నైతికంగా నేరం కాదా? భుక్తి కోసం పనిచేసుకొనే రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కును కాలరాసినట్లు కాదా? చానల్ హెడ్‌లు కనీస మానవీయ కోణంలో ఆలోచించక పోవడం వల్ల ఈ రోజు టీవీ కళాకారులు, సాంకేతిక నిపుణుల కుటుంబాల  పరిస్థితి దయనీయంగా తయారయ్యింది. దీనికి నైతిక బాధ్యత ఎవరిదో అందరికి తెలిసిందే. చానళ్ళ ప్రసారాలకి వీక్షకులే మహారాజ పోషకులు. సీరియళ్ళ విజయంలో వారే  చందాదారులు, నైతిక భాగస్వాములు. వీక్షకుల జీవితంలో భాగమైన సీరియళ్ళ ప్రసారాలకు ఆటంకానికి కారణమై వారి వినోదాన్ని ఆర్నెల్లపాటు దూరం చేసిన పాపం సైతం ఈ బాధ్యులదే!

స్లాట్ ఫీజు మనది- సాఫీ దౌడ్ తమిళ తంబిలది 
తెలుగు ప్రైవేటు చాన్నాళ్ళు ఆవిర్భావం నుంచే తెలుగు వాళ్లకు అన్యాయం చేస్తున్నాయి. జెమిని టీవీ తొట్ట తొలి సీరియళ్ళు అన్నీ తెలుగు నిర్మాతలే చేశారు. అప్పట్లో స్లాట్ ఫీజు చెల్లించవలసి ఉండేది. నిర్మాణ ఖర్చుతోపాటు ప్రతి ఎపిసోడ్‌కు సుమారు యాభై వేలు చెల్లించి ఎన్నో సీరియళ్ళను అభిరుచి, ఉత్సాహం ఉన్న తెలుగు నిర్మాతలు రూపొందించి చేతులు కాల్చుకున్నారు. మధు మహంకాళి  “విష్ణుమాయ”, షరీఫ్ మహ్మద్ “పోలీసు ఫైల్” అగస్త్యశాస్త్రి “కొత్తకోణం” ఈ కోవలోనివే. మనవాళ్ళ త్యాగంతో రహదారులు పడ్డాక మనలను తప్పించి చెన్నై నిర్మాతలు రాడాన్, ఎవిఎం, వికటన్‌లను మనపై రుద్దారు. అనువాద సీరియళ్ళ ధాటికి తెలుగు పరిశ్రమ అప్పట్లో ఒకసారి కుదేలయ్యింది. కళాకారులు, సాంకేతిక వర్గం దిక్కులేని వారయ్యారు. అదే సమయంలో డబ్బింగ్ సీరియళ్ళకు వ్యతిరేకంగా తెలుగు టీవీ పరిశ్రమ ఒక్కతాటి పైకి వచ్చి ఉద్యమించింది. నటుడు విజయ్ యాదవ్ ఆమరణ నిరాహార దీక్షతో పరిశ్రమ దిగివచ్చి హామీలు ఇచ్చింది. క్రమంగా డబ్బింగ్ సీరియళ్ళ నిర్మాణం తగ్గుముఖం పడుతున్నాయని భావిస్తున్నతరుణంలో కన్నడ జగదేక సుందరిలు, ఎగ్జిక్యుటివ్ ప్రొడ్యుసర్లనే శాడిస్ట్ లు, చానల్ హెడ్‌లనే అహంభావుల చేతిలో సృజనాత్మకంగా సాగాల్సిన చానళ్ళు కోతి చేతిలో కొబ్బరికాయలా తయారయ్యాయి. అంతా కలసి తెలుగు టీవీని కోతిపుండు బ్రహ్మ రాక్షసిని చేశారు.  

అస్తిత్వ ఉద్యమ దిశగా తెలుగు టీవీ పరివారం
తెలుగులో మంచి కళాకారులు ఉన్నప్పటికి వారిని పక్కనపెట్టి పరభాషా నటులను ప్రోత్సహించడం అపాత్ర దానమే కాదు. అంతకు మించి ప్రతిభావంతులైన తెలుగు కళాకారులను అవమాన పరిచినట్లే. సున్నితమైన కళాకారుల మనోభావాలు దెబ్బతీస్తూ వారిని ఆత్మన్యూనతకు గురిచేస్తున్నారు. చానళ్ళ తుగ్లక్ చర్యలు తెలుగు కళాకారుల ఆత్మ గౌరవ సమస్యగా పరిణమిస్తోంది. తెలుగు టీవీ పరిశ్రమకు తటస్థుల నుంచి మిగతా పౌర సమాజం నుంచి కూడా క్రమంగా నైతిక మద్దతు లభిస్తోంది త్వరలోనే చానళ్ళకు వ్యతిరేకంగా తెలుగు టెలివిజన్ పరివారం అస్తిత్వ ఉద్యమం ప్రారంభమయ్యే దిశగా పరిస్థితులు కనబడుతున్నాయి.
- ప్రచండ