
‘సీఎం జగన్ దేవుడిలా ఆదుకుంటున్నారు’
సాక్షి, అమరావతి : ఒకప్పుడు డబ్బులు లేక వైద్యం చేయించుకోలేకపోయామని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దేవుడి రూపంలో తమని ఆదుకుంటున్నారని వైఎస్సార్ ఆరోగ్యశ్రీ లబ్ధిదారుడు ఎన్.నారాయణ కొనియాడారు. సీఎం ఉచితంగా వైద్యసాయం అందిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. మన పాలన-మీ సూచన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం వైద్య ఆరోగ్య శాఖ, ఆసుపత్రుల్లో నాడు- నేడుపై తాడేపల్లిలోని క్యాంపు ఆఫీస్‌లో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ముఖ్యమంత్రితో తమ అనుభవాలను పంచుకున్నారు. (ఆరోగ్య రంగంలో అనేక మార్పులు: సీఎం జగన్)
వైఎస్సార్ ఆరోగ్యశ్రీ లబ్ధిదారుడు : ‘‘రెండు కిడ్నీలు ఫెయిల్ అవ్వడంతో ఆందోళనకు గురయ్యా. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా డయాలసిస్ అందిస్తున్నారు. ప్రతినెలా 1వ తేదీన రూ.10వేల పింఛన్ ఇస్తున్నారు’’.
ఏఎన్‌ఎమ్ లత : ‘‘వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, కంటివెలుగు ప్రజల వద్దకు తీసుకెళ్తున్నాం. గ్రామాల్లో 5వ సారి కుటుంబ సర్వే చేస్తున్నాం. ఇలాంటి మరెన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టాలి’’.
వైఎస్సార్ ఆరోగ్యశ్రీ లబ్ధిదారు హేమ : ‘‘ప్రజాసంక్షేమమే ధ్యేయంగా సీఎం జగనన్న పరిపాలన సాగుతోంది. కరోనా కష్టకాలంలో కూడా ప్రజా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి’’.