https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/29/modi_1.jpg?itok=4lVbi9w0

లాక్‌డౌన్‌ 5.0 : మోదీతో అమిత్‌ షా భేటీ

సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతక కరోనా వైరస్‌ కట్టడికి కేంద్ర ప్రభుత్వం విధించిన నాలుగో విడత లాక్‌డౌన్‌ మే 31 (ఆదివారం)తో ముగియనున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. శుక్రవారం సాయంత్రం ప్రధానమంత్రి నివాసంలో వీరు సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో లాక్‌డౌన్‌ పొడిగింపు, దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత పరిస్థితి, కరోనా నియంత్రణకు చేపడుతున్న చర్యలను గురించి ప్రముఖంగా చర్చించనున్నారు. అలాగే దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్న తరుణంలో మరో రెండు వారాల పాటు లాక్‌డౌన్‌ను పొడగించే అంశం కూడా చర్చకు రానుంది. కాగా ఈనెల 31వ తేదీతో ముగియనున్న దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను మరికొద్ది రోజులపాటు పొడిగించాలన్న ప్రతిపాదనపై అమిత్‌ షా గురువారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడిన విషయం తెలిసిందే. (ఆ ఆరు రాష్ట్రాలు హైరిస్క్)

పొడిగింపుపై సీఎంల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఏఏ రంగాలకు మినహాయింపు అవసరం? ఎలాంటి సమస్యలున్నాయి? వంటి అంశాలపై చర్చించారు. సీఎంలు ఏం చెప్పారనే విషయం వెల్లడి కానప్పటికీ, ఏదో ఒక రూపంలో లాక్‌డౌన్‌ పొడిగింపునకే ఎక్కువ మంది మొగ్గు చూపినట్లు సమాచారం. మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్‌, మధ్య ప్రదేశ్‌ ప్రభుత్వాలు మాత్రం మరికొన్ని రోజుల పాటు ఆంక్షలను కొనసాగించాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిసింది. ఆర్థిక కార్యకలాపాలు కొనసాగిస్తూనే.. నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయాలని ముఖ్యమంత్రులు కేంద్రానికి తెలిపినట్లు సమాచారం. దీనిపై కేంద్రం తుది నిర్ణయాన్ని శని, ఆదివారాల్లో ప్రకటించే అవకాశముంది. (మరణాల్లో చైనాను దాటిన భారత్‌)