http://www.teluguglobal.in/wp-content/uploads/2020/05/Locust-attack.jpg

ఏపీలో మిడతల దండు కలకలం… ఇవి అవి కాదని నిర్ధారణ…

ఆంధ్రప్రదేశ్‌లో మిడతల దండు కలకలం రేపింది. ఉత్తరాధి రాష్ట్రాల్లో ఇప్పటికే భారీగా పంటలను మిడతల దండు నాశనం చేస్తోంది. అవి దక్షిణాది రాష్ట్రాలకు కూడా వస్తున్నాయన్న ప్రచారం ఉంది. ఇంతలో అనంతపురం జిల్లా రాయదుర్గంలోని దానప్ప రోడ్డులో గురువారం మిడతల దండు కనిపించింది. అక్కడున్న జిల్లేడు చెట్లపై ఇవి దాడి చేశాయి.

చూస్తుండగానే మొత్తం ఆకులను తినేశాయి. దాంతో జిల్లేడు చెట్లన్నీ మోడుబారి కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని స్థానికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లగా… వ్యవసాయ పరిశోధన శాఖ అధికారులు వచ్చారు. ఈ మిడతల వల్ల పంటలకు ఎలాంటి ప్రమాదం లేదని… ఇవి ఉత్తరాది రాష్ట్రాలపై దాడి చేస్తున్న మిడతల తరహావి కావని నిర్ధారించారు.

రాయదుర్గంలోదాడి చేసిన మిడతలు కేవలం జిల్లేడు మొక్కలను మాత్రమే ఆశిస్తాయని… ఇతర పంటల జోలికి రావని చెప్పారు. అయినా రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అటు విశాఖ జిల్లా కశింకోట మండలం మోసయ్యపేటలో కూడా 50 మీటర్ల పరిధిలో మిడతల దండు దాడికి దిగింది. ఈ దండును కూడా వెంటనే అధికారులు వెళ్లి పరిశీలించారు. ఇవి ప్రమాదకరమైన ఏడారి మిడతలు కాదని అధికారులు నిర్ధారించడంతో రైతులు ఊపిరి తీల్చుకున్నారు.

ప్రస్తుతం ఏపీలోకి ఏడారి మిడతలు రాలేదని… రైతులను భయపెట్టే ప్రచారం చేయవద్దని మంత్రి కన్నబాబు కోరారు. మిడతల దండు దాడి చేస్తే తీసుకోవాల్సిన చర్యలపై ఆయన అధికారులతో చర్చించారు.