బుద్ధికి గడ్డి పెట్టండి
- నేడు వరల్డ్ డైజెస్టివ్ హెల్త్ డే
శరీరానికి మంచిది తినిపించాలి. నిజమే. మరి బుద్ధికి? మంచి ఆలోచనలు జీర్ణం చేసుకుని చెడు ఆలోచనలు విసర్జించగలిగే మానసిక జీర్ణవ్యవస్థ మనకు ఉందా? కట్టు తప్పే బుద్ధికి అప్పుడప్పుడు గడ్డి పెట్టాల్సిన పని లేదా? నేడు ‘వరల్డ్ డైజెస్టివ్ హెల్త్ డే’. శారీరక జీర్ణవ్యవస్థ గురించి చైతన్యం కలిగించుకోవాల్సిన రోజు. కాని మనిషి బుద్ధితో, మనసుతో, ప్రవర్తనతో ముడిపడిన జీర్ణవ్యవస్థ గురించి ఇక్కడ మాట్లాడుకుందాం.
మనిషి అన్నమే కాదు. తిట్లు కూడా తింటుంటాడు. అన్నం దేహానికి. తిట్లు ఆత్మకి. శరీర శుద్ధికి జీర్ణవ్యవస్థ ఉంది. అది నిర్విరామంగా మన ప్రమేయం లేకుండానే పని చేస్తూ శరీరానికి కావలసిన మంచిని తీసుకుని అక్కర్లేని దానిని బయటకు వెళ్లగొడుతూ ఉంటుంది. కాని ఆత్మవిషయం అలా కాదు. దానికి మంచిని అరాయించాల్సిన పని మనదే. దాని నుంచి చెడు తీసేయాల్సిన పనీ మనదే. మనిషి అన్నం తినకపోతే సొమ్మసిల్లిపోతాడు కనుక తప్పక ఆహారం తీసుకుంటాడు. కాని బుద్ధి సొమ్మసిల్లిపోవడం మనకు తెలియదు. అది పతనమైపోవడం తెలియదు. అది పెడత్రోవ పట్టిపోవడం తెలియదు. గమనించుకుంటూ ఉండాలి. ‘ఫుడ్ ఫర్ థాట్’ అన్నారు పెద్దలు. ఈ మేధో ఆహారం కోసం ఏ నాగలి భుజం మీద వేసుకొని ఏ పంట చేల వైపు మనం నడుచుకుంటూ వెళుతున్నామో చూసుకోవాలి.
మెదడుకు మేత
‘ఖాళీగా ఉండే మనసు దెయ్యాల కార్ఖానా’ అన్నారు పెద్దలు. భారతదేశ పర్యటన చేసిన గాంధీజీ ఊళ్లల్లో మనుషులు ఖాళీగా గంటలు గంటలు కూచుని ఉండటాన్ని చూసి చాలా విముఖం చెందాడు. మనిషి ఎప్పుడూ పనిలో ఉండాలని తద్వారా మనసు కూడా ధ్యాసతో ఉండాలని ఆయన భావించాడు. చరఖా ఉద్యమం వెనుకగానీ, పని–పరిశుభ్రత పిలుపు ఇవ్వడం వెనుక గానీ గాంధీజీకి ఉన్న ఉద్దేశ్యం మనిషి కార్యకలాపిగా ఉండాలన్నదే. శరీరం పనిలో ఉంటే మనసుకు కళ్లెం ఉంటుంది. శరీరం విశ్రాంతిగా ఉన్నప్పుడు కూడా దానికి సరైన నీరు పడుతుండాలి. కళలు, పుస్తకాలు, బోధనలు, ప్రవచనాలు... ఇవన్నీ మనసు తాలూకు డైజెస్టివ్ సిస్టమ్‌ను దారిలో పెడుతుంటాయి. బలహీనతలు, వ్యసనాలు, అనవసర వ్యాపకాలు ఇవన్నీ మానసిక అజీర్తిని వ్యక్తపరిచే లక్షణాలు. సంస్కార సమృద్ధి, సాంస్కృతిక సమృద్ధి ఉన్న మనసుకు ఈ తేన్పులు, వికృత వాంతులు ఉండవు.
మనసు మంట
కొందరికి కడుపుమంట ఎక్కువగా ఉంటుంది. ‘ఫలానా వారికి కడుపుమంట జాస్తి’ అని వింటుంటాం. పాపం కడుపు ఏం చేసిందని. తన మానాన తాను తిన్నది అరిగించుకునే పని చేస్తుంటుంది. మంట ఉండేది మనసుకే. ఈ మనసుకు ఆకర్షణీయమైన రంగులు నిండిన, రుచి ఉంటుందనిపించే జంక్‌ఫుడ్‌లాంటి ఈర్ష్య, అసూయ, ద్వేషం, అక్కసు, ఓర్వలేనితనం కావాలనిపిస్తూ ఉంటుంది. మనం పెడుతూ పోతుంటే అది నింపుకుంటూ పోతూ ఉంటుంది. ఇవి నిండే కొద్దీ వాటికి తగినట్టుగా శరీరం పనుల్లోకి దిగుతుంది. ఆ పనులే తప్పులు, పాపాలు, నేరాలు, ఘోరాలు. బుద్ధికి సరైన తిండి తినని, సరి కానిది విసర్జించుకోలేని మనసుల చర్యలే నేడు మానవ ప్రపంచానికి ప్రమాదాలుగా, పీడనలుగా, వేదనలుగా, యుద్ధాలుగా పరిణామిస్తున్నాయి.
నెమరువేసుకోవాల్సిన మాట
‘నీ అన్నం నువ్వే అరాయించుకోవాలి... నీ కష్టాలు నువ్వే భరాయించుకోవాలి’ అని అత్తారింటికి వెళుతున్న వాణిశ్రీతో ఆమె తండ్రి కాంతారావు ‘గోరంతదీపం’లో అంటాడు. ముళ్లపూడి వెంకటరమణ రాసిన డైలాగ్ ఇది. దాంతోపాటు ‘నీకు చెడు అయినది వదులుకోవాలి... నువ్వు చెడు చేసేది వదిలించుకోవాలి’ అని కూడా ఉండాలి. ఆ చెడు వదులుకోలేని, అంటే మలబద్ధకం వలే చెడు బద్ధకం ఉన్న మనుషులు పురాణాల్లో, కథల్లో, నిజజీవితాల్లో ఎన్ని ఉత్పాతాలు సృష్టించగలరో మనకు తెలుసు. చూస్తున్నాం. దుర్యోధనుడు, రావణుడు తిన్నది అరక్క అంటే శరీరం కాదు మనసు ఏం చేశారో యుగాలుగా చెప్పుకుంటున్నాం. కులాలని, మతాలని, ప్రాంతాలని, భాషలని, స్త్రీ పురుష భేదాలని ఎన్ని విభేదాలకు పోతున్నామో అనుభవిస్తున్నాం. చక్కటి అరిటాకు మీద తెల్లటి వరి అన్నం తిన్నప్పుడు కడుపుకు ఎలాగైతే శాంతి కలుగుతుందో ఈ నేలన పుట్టిన సమస్త జనులూ సమానమే ఆదరణీయమే సహోదర రూపమే అనుకున్నప్పుడు మనసుకు కూడా అంతే శాంతి కలగదా? మనసు కోరుకోవాల్సిన ఆహారం అదే కదా? దాని ప్రేవుల్లో నిండాల్సిన ఆలోచన అదే కాదా? అక్కడ శక్తిగా మారి వెలికి రావాల్సిన కాంతి అదే కదా? ఇవాళ ఏం తింటున్నాం అని కిచెన్‌లోకి వెళ్లడం, ఫ్రిజ్జు తెరవడం ఎప్పుడూ చేసే పనే. మన మనసు ఏం తింటోంది... దానిలో అరక్క అడ్డం పడి ఉన్నది ఏది అనేది ఇవాళ తరచి చూసుకుందాం.