కేసీఆర్ పేరుకు కొత్త నిర్వచనం..
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరుకు ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్ కొత్త నిర్వచనం చెప్పారు. తెలంగాణలో కోటి ఎకరాల మాగాణికి నీరందించడమే లక్ష్యంగా.. కేసీఆర్ అనేక ప్రాజెక్టులకు రూపకల్పన చేసిన సంగతి తెలిసిందే. తాజాగా శుక్రవారం కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజక్ట్‌లో భాగమైన కొండపోచమ్మ రిజర్వాయర్(మర్కూక్) పంప్‌హౌస్‌ను కేసీఆర్ ప్రారంభించారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. ప్రపంచంలోనే అతిపెద్ద బహుళార్ధ సాధక ఎత్తిపోతల పథకం కాళేశ్వరాన్ని దేశంలోనే యువ రాష్ట్రమైన తెలంగాణ కేవలం మూడేళ్లలోనే పూర్తి చేసిందని తెలిపారు. కేసీఆర్.. తన పేరును K-కాల్వలు, C-చెరువులు, R-రిజర్వాయర్లు సార్థకం చేసుకున్నారని అన్నారు. తెలంగాణలో కాల్వలు, చెరువులు, రిజర్వాయర్లు జలకళను సంతరించుకున్నాయనే ఉద్దేశంతో కేటీఆర్ ఈ విధంగా స్పందించారు.(చదవండి : కొండపోచమ్మకు గోదావరి జలాలు..)
మేడిగడ్డ నుంచి కొండపోచమ్మ వరకు, సముద్ర మట్టానికి 82 మీటర్ల ఎత్తు నుంచి 618 మీటర్ల ఎత్తు వరకు నీటిని చేరవేశామని కేటీఆర్ తెలిపారు. కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ ద్వారా 2.8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే కాకుండా.. త్వరలోనే కేశవపురం రిజర్వాయర్ ద్వారా హైదరాబాద్ తాగునీటి అవసరాలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని పేర్కొన్నారు. దూరదృష్టితో భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టులు నిర్మిస్తున్న కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.(చదవండి : కొండపోచమ్మ ఆలయంలో కేసీఆర్ దంపతుల ప్రత్యేక పూజలు)