https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/29/World-Cup.jpg?itok=TwekSo0z

రిస్క్‌ చేద్దామా.. వద్దా?



ముంబై: ఈ ఏడాది అక్టోబర్‌-నవంబర్‌ నెలల్లో జరగాల్సిన టీ20 వరల్డ్‌కప్‌ షెడ్యూల్‌ ప్రకారం జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. దీనిపై ఆతిథ్య దేశం ఆస్ట్రేలియా డైలమాలో పడింది. నిర్ణీత షెడ్యూల్‌లో వరల్డ్‌కప్‌ జరపడం కష్టమనే భావనకు సీఏ వచ్చేసింది. గురువారం ద్వైపాక్షిక సిరీస్‌లకు షెడ్యూల్‌ ప్రకటించిన సీఏ.. కనీసం టీ20 వరల్డ్‌కప్‌ ప్రస్తావనను ఎక్కడా తీసుకురాలేదు. ఆగస్టు నెల నుంచి ఫిబ్రవరి వరకూ జరుగనున్న 2020–21 హోమ్‌ సీజన్‌ షెడ్యూల్‌ను మాత్రమే ప్రకటించింది. వరల్డ్‌కప్‌ గురించి అసలు పట్టించుకోలేదు. అదే సమయంలో ప్రస్తుత పరిస్థితుల్లో వరల్డ్‌కప్‌ నిర్వహించడం సవాల్‌ కూడకున్న పని అని క్రికెట్‌ ఆస్ట్రేలియా సీఈఓ కెవిన్‌ రాబర్ట్స్‌ పేర్కొన్నాడు. కరోనా వైరస్‌ విస్తృతి నేపథ్యంలో వరల్డ్‌కప్‌ నిర్వహణ అనేది అతి పెద్ద రిస్క్‌ మనసులో మాటను బయటపెట్టాడు.(ప్రపంచకప్‌ ప్రస్తావన లేకుండానే...)

‘అక్టోబర్‌-నవంబర్‌ నాటికి పరిస్థితులు అదుపులోకి వస్తాయని ఆశిద్దాం. కానీ పరిస్థితులు ఎంత అదుపులోకి వచ్చినా ఒక మెగా ఈవెంట్‌ను నిర్వహించడం కత్తిమీద సామే. ఒకవేళ ముందస్తు షెడ్యూల్‌ ప్రకారం వరల్డ్‌కప్‌ జరగకపోతే ఫిబ్రవరి-మార్చి విండోలో అది జరపడానికి కసరత్తులు చేయాల్సి ఉంటుంది’ అని రాబర్ట్స్‌ అన్నారు. ఇది ఐసీసీ తీసుకునే తుది నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుందన్నారు. ఇక గురువారం ఐసీసీ నిర్వహించిన సమావేశంలో కూడా వరల్డ్‌కప్‌పై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. వరల్డ్‌కప్‌ నిర్వహణపై నిర్ణయాన్ని జూన్‌ 10వ తేదీన జరిగే తదుపరి సమావేశానికి వాయిదా వేసింది. 

జరిగితే ఆశ్చర్చ పడాల్సిందే..
షెడ్యూల్‌ ప్రకారం టి20 ప్రపంచ కప్‌ జరగడం సందేహమేనని ఇంగ్లండ్‌ జట్టు కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ అభిప్రాయ పడ్డాడు. కోవిడ్‌–19 నేపథ్యంలో 16 జట్లతో మెగా టోర్నీ నిర్వహించడం అసాధ్యమని అతను అన్నాడు. ‘నిజంగా షెడ్యూల్‌ ప్రకారం జరిగితే మనమంతా ఆశ్చర్యపడాల్సిందే. ఆస్ట్రేలియాలో ప్రస్తుతం కరోనా సమస్య తక్కువగా, నియంత్రణలోనే ఉందనేది వాస్తవం. అయితే ఒక చిన్న పొరపాటు కూడా ఎంతో ప్రమాదకరంగా మారిపోవచ్చు’ అని పేర్కొన్నాడు. మరి వరల్డ్‌కప్‌పై రిస్క్‌ చేసి షెడ్యూల్‌ ప్రకారం ముందుకెళతారా.. లేదా అనే మరి కొన్ని రోజులు తేలిపోనుంది. (‘భారత్‌ ఓడిపోతుందని అనలేదు’)