‘భారత్ ఓడిపోతుందని అనలేదు’
- పాకిస్తాన్ మాజీ బౌలర్‌కు స్టోక్స్ రిప్లై
- స్టోక్స్ రాతల్ని చూపించండి: నెటిజన్ సవాల్
లండన్: గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో భారత్ సెమీ ఫైనల్లోనే వెనుదిరిగింది. న్యూజిలాండ్‌తో జరిగిన నాకౌట్ సమరంలో టీమిండియా ఓడిపోవడంతో ఫైనల్ ఆశలు నెరవేరలేదు. అయితే లీగ్ మ్యాచ్‌ల్లో వరుస విజయాలు సాధిస్తూ వచ్చిన టీమిండియా.. కేవలం ఇంగ్లండ్ చేతిలో మాత్రమే పరాజయాన్ని చవిచూసింది. దీనిపై అప్పట్లో పెద్ద దుమారమే లేచింది. పాకిస్తాన్‌ను నాకౌట్‌కు చేరకుండా అడ్డుకోవడానికే ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయిందనే వార్తలు వచ్చాయి. అయితే ఇవే మాటల్ని ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ రాసిన ‘ఆన్ ఫైర్’ పుస్తకంలో ప్రస్తావించినట్లు పాకిస్తాన్ మాజీ బౌలర్ సికిందర్ బక్త్ ఆరోపించాడు. ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓడిపోతుందనే విషయాన్ని స్టోక్స్ వెల్లడించాడంటూ మండిపడ్డాడు. దీనిపై సికిందర్ బక్త్‌ను ఒక నెటిజన్ ప్రశ్న రూపంలో అడిగాడు. ఆ కామెంట్‌ను స్టోక్స్ ఎక్కడ చేశాడో చెప్పాలంటూ సవాల్ చేశాడు. అదే సమయంలో స్టోక్స్ కౌంటర్ ఎటాక్‌కు దిగాడు. తాను ఎక్కడ ఆ విషయాన్ని పేర్కొన్నానో చెప్పాలంటూ నిలదీశాడు.(సౌరవ్ గంగూలీ రేసులో లేడు..కానీ)
దాన్ని తాను చెప్పనప్పుడు వెతికి పట్టుకోవడం కుదరపని అంటూ ఎద్దేవా చేశాడు. ఆ పుస్తకంలో ధోని ఆడుతున్నప్పుడు ఉన్న రన్‌రేట్‌ను స్టోక్స్ ప్రస్తావించాడు. ఒకవేళ భారత్ ఓడిపోయినా అదే రన్‌రేట్‌ను ధోని కడవరకూ కొనసాగిస్తే భారత్‌కు మంచి రన్‌రేట్ ఉంటుందని మాత్రమే పేర్కొన్నాడు. దీన్ని సికిందర్ బక్త్ మాత్రం పాకిస్తాన్ అడ్డుకోవడానికి ఆపాదించుకున్నాడు. రన్‌రేట్ అంశాన్ని స్టోక్స్ పేర్కొనడం పాకిస్తాన్ నాకౌట్ ఆశల్ని నీరుగార్చడం కోసం జరిగిన ప్రణాళికగా బక్త్ పేర్కొన్నాడు. గతేడాది ఇంగ్లండ్‌తో లీగ్ మ్యాచ్‌లో భారత్ 31 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 337 పరుగులు చేయగా, భారత్ 306 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. ఆ మ్యాచ్‌లో రోహిత్ శర్మ(102), కోహ్లి(66), రిషభ్ పంత్(32), హార్దిక్ పాండ్యా(45), ఎంఎస్ ధోని(42 నాటౌట్)లు రాణించినా భారీ లక్ష్యం కావడంతో జట్టును గెలిపించలేకపోయారు. చివరి వరకూ ధోని క్రీజ్‌లో ఉన్నా భారత్‌ను విజయ తీరాలకు చేర్చలేకపోయాడు. (ఏదో ఒకటి వాడనివ్వొచ్చుగా! )