https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/29/wiki.jpg?itok=CPrzwskp

సోషల్‌ మీడియాకు సంకెళ్లా?..ట్రంప్‌ ఉత్తర్వులపై వికీపీడియా



సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై నియంత్రణకు ట్రంప్‌ త్వరలో ఆదేశాలిస్తారన్న వార్తలపై వికీపీడియా వ్యవస్థాపకుడు జిమ్మీ వేల్స్‌ ఆందోళన వ్యక్తం చేశారు. అలా చేయడానికి అధ్యక్షుడికి అధికారాల్లేవని, ఒకవేళ ట్రంప్‌ అలాంటి ఆదేశాలిస్తే అవి న్యాయబద్ధం కావని చెప్పారు. యూఎస్‌ రాజ్యాంగానికి జరిగిన తొలి సవరణ భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు అధిక ప్రాధాన్యమిస్తుందని గుర్తు చేశారు. అయితే రాజకీయకారణాలతో ఏదైనా సాకులు చెప్పి భావస్వేచ్ఛను నియంత్రించేందుకు ప్రయత్నించే జిత్తులు ప్రభుత్వాల వద్ద ఉంటాయన్నారు. కానీ ఇలా నియత్రించే యత్నాలు ప్రజాస్వామ్యానికి మంచివి కాదని, ప్రమాదకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ అనేవి ప్రజలు తమ అభిప్రాయాలను, ఆలోచనలను వ్యక్తం చేసుకునేందుకు సాధనాలని చెప్పారు. గతంలో ప్రజాభిప్రాయాన్ని కంట్రోల్‌ చేయాలని పరోక్షంగా యత్నించిన ఫేస్‌బుక్‌ ప్రస్తుతం ప్రజాభిప్రాయ స్వేచ్ఛ గురించి మాట్లాడడం విడ్డూరమన్నారు. ఇదే సమయంలో సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను దుర్వినియోగం చేయడం కూడా మనం చూశామన్నారు. ఇలాంటివి జరగకుండా సదరు ప్లాట్‌ఫామ్స్‌ చర్యలు తీసుకోవాలని సూచించారు. వికీపీడియాలో ఉంచే సమాచారాన్ని పూర్తిగా నమ్మదగిన వర్గాల నుంచే సేకరిస్తామని, ఇందుకు తాము అధిక ప్రాధాన్యమిస్తామని చెప్పారు. ఇందుకోసం టాప్‌ ర్యాంకింగ్‌ ఉన్న పత్రికలు, మ్యాగజైన్ల నుంచి రిఫరెన్స్‌ తీసుకుంటామన్నారు. ఉదాహరణకు ప్రెసిడెంట్‌ ట్రంప్‌ ఏదైనా చెత్త మాట్లాడితే దాన్ని సోర్స్‌గా అంగీకరించమన్నారు.