https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/29/suicide.jpg?itok=UCOAb-ry
లాల్‌సాహెబ్‌ మృతదేహం వద్ద రోదిస్తున్న బంధువులు,లాల్‌సాహెబ్‌ ( ఫైల్‌)

ఈ రోజు నా గడువు తీరిందని లేఖలో ..



భద్రాద్రి కొత్తగూడెం,కూసుమంచి: కుటుంబసభ్యులు సుమారు మూడేళ్ల క్రితం కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో ఒంటరిగా మిగిలిన యువకుడు వారులేని లోటును భరించలేక బతుకు సాగించలేక తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మండల పరిధిలోని జీళ్లచెరువు గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. జీళ్లచెరువు గ్రామానికి చెందిన షేక్‌ లాల్‌సాహెబ్‌ (29) తల్లిదండ్రులతో పాటు అతని అన్న, వదిన, పిల్లలు 2017లో పాలేరులోని మినీ హైడల్‌ ప్రాజెక్టు కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అప్పటి నుంచి లాల్‌సాహెబ్‌ ఒంటరిగా ఉంటున్నాడు. స్నేహితులతో గడుపుతూ కాలం వెళ్లదీస్తున్నాడు కన్నవారు, తోడబుట్టిన వారు దూరం కావటాన్ని జీర్ణించుకోలేక పలు మార్లు ఆత్మహత్యకు యత్నించాడు. చివరకు గ్రామ శివారులోని ఓ వెంచర్‌లో పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం ఉదయం అటుగా వెళ్లిన స్థానికులు లాల్‌సాహెబ్‌ మృతదేహాన్ని గుర్తించి గ్రామస్తులకు, పోలీసులకు సమాచారం అందించారు. బుధవా రం రాత్రే ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు.

నా టైమ్‌ తీరింది..
ఆత్మహత్యకు పాల్పడ్డ లాల్‌సాహెబ్‌ జేబులో ఒక లేఖను పోలీసులు గుర్తించారు. ఆ లేఖలో తాను ఎందుకు చనిపోవాల్సి వచ్చిందో తన డ్రస్సింగ్‌ టేబుల్‌ వద్ద మరో లేఖ ఉందని, దాన్ని చదవాలని రాసిఉంది. డ్రస్సింగ్‌ టేబుల్‌ వద్ద మరో లేఖ లభ్యంకాగా అందులో తనవారందరూ తనకు దూరమయ్యారని, అప్పటి నుంచి సంతోషంగా బతకలేకపోతున్నాని, తాను ఎప్పటి నుంచో చనిపోవాలని అనుకుంటున్నానని పేర్కొన్నాడు. ప్రతి వస్తువుకు గడువుతేదీ ఉన్నట్లు తనకు ఈ రోజు గడువు తీరిందని, తన స్నేహితులు తనను నమ్మి అప్పులు ఇచ్చారని,  తన ఇల్లు, మిగిలిఉన్న కొంత భూమి అప్పులు అమ్మి తీర్చాలని అధికారులను, గ్రామపెద్దలను కోరాడు. లేఖలో రూ.14 లక్షల 80వేల అప్పులు   ఉన్నట్లు, ఎవరికి ఎంత ఇవ్వాలో పేర్లతో రాసి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. బంధువులు, స్నేహితులు, గ్రామస్తులు అంత్యక్రియలు పూర్తిచేశారు. కాగా మృతుడు అవివాహితుడు.