సౌరవ్ గంగూలీ రేసులో లేడు..కానీ
- ఇంకా బీసీసీఐ నిర్ణయం తీసుకోలేదు
- బరిలో దిగుదామా.. సపోర్ట్ చేద్దామా
- బోర్డు పెద్దలు తర్జన భర్జన
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) చైర్మన్ పదవి రేసులో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఉన్నట్లు వచ్చిన వార్తలను బోర్డు ట్రెజరర్ అరుణ్ ధుమాల్ ఖండించారు. ఐసీసీ చైర్మన్ పదవి కోసం గంగూలీ పోటీ చేయడం లేదంటూ తాజాగా స్పష్టం చేశారు. బీసీసీఐ అధ్యక్షుడిగా ఉండి ఐసీసీ చైర్మన్ పదవి కోసం పోటీ పడటం విరుద్ధమని ఇప్పటికే విమర్శలు రావడంతో అరుణ్ ధుమాల్ వివరణ ఇచ్చారు. ‘ ఐసీసీ చైర్మన్ రేసులో గంగూలీ లేడు. అవన్నీ రూమర్లు మాత్రమే. ఐసీసీ అధ్యక్ష రేసులో బీసీసీఐ నుంచి ఎవరు ఉండాలనే దానిపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దీనిపై త్వరలోనే స్పష్టత వస్తుంది. ఇందుకోసం నిరీక్షించక తప్పదు. బీసీసీఐ నుంచి పోటీ పెడదామా.. లేక వేరే వాళ్లకు సపోర్ట్ చేద్దామా అనే విషయంలో కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు’ అని అరుణ్ ధుమాల్ తెలిపారు. (ఐసీసీ నాయకత్వ స్కిల్స్.. గంగూలీలో భేష్)
ఐసీసీ చైర్మన్ పదవి కోసం జూలైలో ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం ఐసీసీ చైర్మన్‌గా ఉన్న శశాంక్ మనోహర్ జూలై నెలలోనే ఆ పదవి నుంచి తప్పుకోనున్నారు. మే నెలతోనే శశాంక్ పదవీ కాలం ముగిసినా మరో రెండు నెలలు అందులో కొనసాగారు. ఇప్పటికే రెండు పర్యాయాలుగా ఆ పదవిలో కొనసాగుతున్న ఆయన మరోమారు ఆ బాధ్యతలు చేపట్టేందుకు సిద్దంగా లేనట్లు ప్రకటించారు. అదే సమయంలో కరోనా కారణంగా లాక్‌డౌన్ ఏర్పడటంతో మరో రెండు నెలలు ఐసీసీ చైర్మన్‌గా ఉండటానికి సిద్ధమయ్యారు. కాగా, ఇక జూలై తర్వాత ఐసీసీ చైర్మన్ కొనసాగనని మనోహర్ స్పష్టం చేయడంతో ఎన్నికలు తప్పనిసరి అయ్యాయి. ఆయన తప్పుకుంటే చైర్మన్‌గా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) చైర్మన్ కొలిన్ గ్రేవ్స్ ఎన్నికయ్యే అవకాశాలుగా ఎక్కువగా కనబడుతున్నాయి. అయితే ఐసీసీ చైర్మన్‌గా గంగూలీ ఉంటే మరింత పారదర్శకత వస్తుందని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ బహిరంగంగా మద్దతుగా తెలపగా, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ డేవిడ్ గోవర్ కూడా అభిప్రాయపడ్డాడు. దాంతో ఐసీసీ చైర్మన్ పదవి కోసం గంగూలీ పోటీ ఖాయమనే వార్తలు వ్యాపించాయి. వీటిని అరుణ్ ధుమాల్ ఖండించడమే కాకుండా, చూద్దాం అనే సంకేతాలు ఇవ్వడంతో బీసీసీఐ ఎవరో ఒకర్ని పోటీలో నిలిపే అవకాశాలు కూడా లేకపోలేదు.(ధోనికి ఆ హక్కు ఉంది)