అండమాన్‌లో ఆర్తనాదాలు
- దీవిలో చిక్కుకున్న సిక్కోలు వాసులు
- స్వస్థలాలకు తరలించాలని వేడుకోలు
కాశీబుగ్గ: అండమాన్ నికోబర్ దీవుల్లో సిక్కోలు వాసులు ఆర్తనాదాలు చేస్తున్నారు. అక్కడ ఉండలేక స్వగ్రామాలకు వెళ్లలేక కుటుంబాలకు దూరమై ఆకలి కేకలు పెడుతున్నారు. అక్కడ తమ అగచాట్లను వాట్సాప్ ద్వారా వీడియో, చిత్రాలు పంపిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వీలైనంత తొందరగా తెలుగు వాళ్లను రప్పించే ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అండమాన్ నికోబర్ దీవుల్లోనూ కరోనా వైరస్ వ్యాపించడంతో అక్కడ నుంచి రాష్ట్రానికి వెళ్లే అన్ని రవాణా సౌకర్యాలు పూర్తిగా నిలిపివేశారు. దాంతో అభర్డెన్ బజార్, జంగ్లీఘట్, డైరీఫారం, బృక్షబాద్, డిగిలిపూర్, కమ్మలబ్యాగ్, వండూరు, మాయబందర్, బాతుబస్తీ, గేరాచలంలో రెండు వేల మంది మత్స్యకారులతోపాటు పర్యాటకులు కరోనా లాక్‌డౌన్‌లో చిక్కుకున్నారు. (ఆ ఆరు రాష్ట్రాలు హైరిస్క్)
అండమాన్ నికోబర్ దీవిలో చిక్కుకున్న మత్స్యకారులు
జిల్లాలో మందస, పలాస, వజ్రపుకొత్తూరు, కవిటి, సోంపేట, ఇచ్ఛాపురం, రణస్థలం మండలాలకు చెందిన వారు అధికంగా ఉన్నారు. వీరికి ఎటువంటి ప్రయాణ సౌకర్యాలు లేక వేట సాగక తినడానికి తిండి లేక ఉండటానికి ఇల్లు లేక ఫిషింగ్ జెట్టీల బోట్లపై పడుకుని కాలం గడుపుతున్నారు. రెండు నెలలుగా ఇవే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అండమాన్ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని, ఆకలి బాధలతో అలమటిస్తున్నామని కంటతడి పెడుతున్నారు. ఈ నెల 25 నుంచి రవాణా సౌకర్యం పునరుద్ధరించడంతో అండమాన్ నుంచి వైజాగ్‌కు ఓడ లేదా విమానంలో తరలించాలని కోరుతున్నారు. ప్రస్తుతం అండమాన్‌లో ఒక్క కరోనా వైరస్ రోగి లేరని చెబుతున్నారు. ఇప్పటి వరకు గుజరాత్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో చిక్కుకున్న వారిని స్వస్థలాలకు చేర్చడంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. (ఎన్ 95 మాస్క్‌ల పేరుతో భారీ మోసం)
ఓడలపై తలదాచుకుంటున్న మత్స్యకారులు