https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/29/Thierry-delaporte.jpg?itok=qdHFhfOi

విప్రో సీఈవోగా క్యాప్‌జెమిని సీవోవో



సాఫ్ట్‌వేర్‌ సేవల దేశీ దిగ్గజం విప్రో లిమిటెడ్‌ కొత్త సీఈవోగా థియర్రీ డెలాపోర్ట్‌ను ఎంపిక చేసుకుంది. క్యాప్‌జెమిని చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌(సీవోవో)గా ఇటీవల వరకూ బాధ్యతలు నిర్వహించిన డెలాపోర్ట్‌ను సీఈవో, ఎండీగా నియమిస్తున్నట్లు విప్రో తాజాగా పేర్కొంది. ఇప్పటివరకూ విప్రో సీఈవోగా కొనసాగుతున్న అబిదాలీ నీముచ్‌వాల ఈ నెల31కల్లా బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. దీంతో జూన్‌ 1 నుంచీ డెలాపోర్ట్‌ విప్రో కొత్త సీఈవోగా పదవిని చేపట్టనున్నారు. నాలుగేళ్లుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న నీముచ్‌వాల వ్యక్తిగత కారణాలతో తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది.

డెలాపోర్ట్‌ బ్యాక్‌గ్రౌండ్‌
ఐటీ సేవల దిగ్గజం క్యాప్‌జెమిని గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ బోర్డులో సభ్యుడైన డెలాపోర్ట్‌ వివిధ హోదాలలో పాతికేళ్లకుపైనే కంపెనీలో పనిచేశారు. ఈ బాటలో గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ వ్యూహాత్మక బిజినెస్‌ యూనిట్‌కు సీఈవోగా సైతం విధులు నిర్వహించారు. గ్లోబల్‌ సర్వీస్‌ విభాగాలకు అధిపతిగా బాధ్యతలు చేపట్టారు. దేశీయంగా క్యాప్‌జెమిని కార్యకలాపాలను పర్యవేక్షించారు.