గ్రేటర్‌లో 58 కేసులు.. అదే స్థాయిలో మరణాలు
- నగరంలో పెరుగుతున్న కరోనా బాధితుల సంఖ్య
- అదే స్థాయిలో మరణాలు
- గురువారం 58 పాజిటివ్ కేసులు నమోదు
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లో కరోనా వైరస్ విస్తృతి ఆగడం లేదు. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటం, అదే స్థాయిలో మరణాలు నమోదవుతుండటంతో నగరవాసు లు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. గురువారం గ్రేటర్ పరిధిలో 58 పాజిటివ్ కేసులు నమోద య్యాయి. ఇప్పటి వరకు తెలంగాణలో 2098 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఒక్క గ్రేటర్ లోనే 1352 పాజిటివ్ కేసులు నమోదు కావడం విశేషం. ఇప్పటి వరకు 63 మంది మృతి చెందగా, వీరిలో 53 మంది సిటిజన్లే ఉండటం ఆందోళన కలిగిస్తుంది. ఈ నెలలో కేవలం 27 రోజుల్లో 31 మంది మృతి చెందడం గమనార్హం.
ఐడిహెచ్ కాలనీలో ముగ్గురికి..
బన్సీలాల్‌పేట్ డివిజన్ ఐడిహెచ్ కాలనీలో ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా తెలింది. కాలనీకి చెందిన రైల్వే రిటైర్డ్ ఉద్యోగి(67) పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో అతడి భార్య కుమారుడికి కూడా పరీక్షలు నిర్వహించగా కుమారుడు(24)కి పాజిటివ్ వచ్చింది. అదే బ్లాక్‌లో ఉంటున్న జీహెచ్‌ఎంసీ ఎంటమాలజీ విభాగంలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న యువకుడు(34)కి కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఐడిహెచ్ కాలనీలో కంటైన్‌మెంట్ ఏర్పాటు చేశారు.
దూద్‌బావిలో ఒకరికి పాజిటివ్
చిలకలగూడ : మెట్టుగూడ డివిజన్ దూద్‌బావికి చెందిన వ్యక్తి (48) టైలర్‌గా పని చేసేవాడు ఈ నెల 26న జ్వరం, జలుబు, దగ్గు రావడంతో వెద్యులు కరోనా లక్షణాలు ఉండటంతో గాంధీ ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. గాంధీ ఆస్పత్రిలో నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించగా అతడికి పాజిటివ్ వచ్చింది.
చింతల్‌లో యవకుడికి..
దుండిగల్: చింతల్ గణేష్‌నగర్‌కు చెందిన యువకుడు గుమ్మడిదలలోని ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు. గత కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్న అతను ఈ నెల 27న గాంధీ ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోగా అతనికి కరోనా పాజిటివ్ వచ్చింది..
గోషామహల్ పరిధిలో మహిళకు..
గోషామహల్ సర్కిల్ పరిధిలోని చుడిబజార్‌కు చెందిన మహిళ(50)కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె కింగ్‌కోఠి ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ వచ్చింది.
బడిచౌడిలో వృద్ధుడికి..
సుల్తాన్‌బజార్: బడిచౌడిలో ఓ వృద్ధుడి(55కి కరోనా పాజిటివ్ రావడంతో వైద్యాధికారులు అతడిని గాంధీ ఆసుపత్రికి తరలించారు.
జియాగూడలో మరో ఆరుగురికి..
జియాగూడ: జియాగూడలోని పలు ప్రాంతాల్లో గురువారం మరో ఆరు కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. సాయిదుర్గానగర్‌లో ఉంటున్న అన్నదమ్ములకు (37),(30), లక్ష్మీనరసింహనగర్‌లో ఓ వృద్ధురాలి(63)కి, వెంకటేశ్వర్‌నగర్‌లో ఓ వ్యక్తి (30)కి కరోనా పాజిటివ్ వచ్చింది. మక్బరా ప్రాంతంలో మరో ఇద్దరికి కూడా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు.
అల్వాల్‌లో మరో రెండు కేసులు
అల్వాల్: అల్వాల్ సర్కిల్ పరిధిలో గురువారం మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మచ్చబొల్లారం అంజనపూరి కాలనీకి చెందిన యువకుడు(29) నగరంలో హోం గార్డుగా పనిచేస్తున్నాడు. ఇటీవల అస్వస్థతకు గురికావడంతో వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. గురువారం అతడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వెంకటాపురంలో నివసించే వ్యక్తి (51) ప్రైవేట్ బ్యాంక్‌లో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కిడ్ని సంబంధిత వ్యాధితో బాధపడుతున్న అతడిని గాంధీ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.