నివేదిక వచ్చాక నిర్ణయం: సీఎం జగన్
- విశాఖ గ్యాస్ లీక్ ప్రమాదంపై సీఎం జగన్
- ఘటన తర్వాత బాధితులను వేగంగా ఆదుకున్నాం
- 10 రోజుల్లోనే రూ. 50 కోట్ల సహాయం చేశాం
సాక్షి, అమరావతి : విశాఖలో గ్యాస్ లీక్ దుర్ఘటనపై లోతుగా దర్యాప్తు జరుగుతోందని, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన కమిటీలు ఆ దిశగా పని చేస్తున్నాయని, నివేదికలు వచ్చాక ఒక నిర్ణయానికి వచ్చి తగిన చర్యలు తీసుకుంటామని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. ఘటన తర్వాత బాధితులను వేగంగా ఆదుకున్నామని, కేవలం పది రోజుల్లోనే దాదాపు రూ.50 కోట్ల మేర ఆర్థిక సాయం చేశామని తెలిపారు. పరిశ్రమలు– మౌలిక సదుపాయాలపై గురువారం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మేధోమథన సదస్సులో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు. (టీటీడీ ఆస్తుల విక్రయం నిషిద్ధం)
చట్టంలో మార్పు చేస్తాం
► ప్రజలు ఎక్కువగా ఉన్నచోట ఆరెంజ్, రెడ్ పరిశ్రమలు లేకుండా కాలుష్య నియంత్రణ చట్టాన్ని మార్చబోతున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
► సదస్సులో మంత్రులు మేకపాటి గౌతమ్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్ నీలం సాహ్ని, పరిశ్రమల శాఖ అధికారులు, పారిశ్రామిక వేత్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు (ఏపీకి ప్రత్యేక బలం ఉంది : సీఎం జగన్)
► రాష్ట్రంలో కాలుష్య నియంత్రణకు చర్యలు చేపడుతున్నామని పేర్కొంటూ ఇటీవల విశాఖలో జరిగిన గ్యాస్ లీక్ దుర్ఘటనను సీఎం జగన్ ప్రస్తావించారు. ఎల్‌జీ పాలిమర్స్‌లో జరగకూడని ఘటన జరిగిందని, దురదృష్టవశాత్తూ ప్రజలు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ గ్యాస్ లీక్ ఘటన విషయంలో రాష్ట్రానికి ఒక తండ్రిలా ఆలోచన చేశానని సీఎం పేర్కొన్నారు. ఘటన జరిగిన వెంటనే దురుసుగా వ్యవహరించి ఉంటే పారిశ్రామిక వర్గాల్లో భయాన్ని రేకెత్తిస్తున్నారనే విమర్శలు వచ్చేవని, అదే సమయంలో ఏమీ చేయకుంటే ప్రభుత్వం సరిగా పని చేయడం లేదనే విమర్శలు కూడా చేస్తారన్నారు. అందుకనే రాష్ట్రానికి ఒక తండ్రిలా ఆలోచన చేశానన్నారు. రాష్ట్రానికి అభివృద్ధి ముఖ్యమని, అయితే దానివల్ల ప్రజలకు నష్టం జరగకూడదని సీఎం స్పష్టం చేశారు.
► ఏం జరిగిందో తెలుసుకోకుండా, వాస్తవాలు గుర్తించకుండా కఠిన చర్యలు తీసుకుంటే పారిశ్రామిక వర్గాలలో ఒక భయానికి ఆస్కారం ఇచ్చినవాళ్లం అయ్యేవాళ్లం. అదే సమయంలో ప్రజల ప్రాణాలు, బాగోగులు ముఖ్యం. అందుకే రాష్ట్రానికి ఒక తండ్రిగా అన్నీ చూడాలి, అభివృద్ధి జరగాలి, అటు ప్రజలకు నష్టం జరగకూడదు కాబట్టి ప్రభుత్వం రంగంలోకి దిగి 10 రోజుల్లోనే బాధితులకు దాదాపు రూ.50 కోట్ల మేర ఆర్థిక సాయం చేశాం.
► ఘటన జరిగిన సమయంలో అలారం ఎందుకు మోగలేదనే విషయాన్ని దర్యాప్తు కమిటీలు పరిశీలిస్తున్నాయని చెప్పారు. ప్రజల సందేహాలను కూడా నివృత్తి చేసేందుకు పత్రికా ప్రకటనలు కూడా ఇచ్చామన్నారు. ప్రజల బాగోగులను దృష్టిలో ఉంచుకుని అక్కడ ఉన్న రసాయనాన్ని తరలించామన్నారు. (నేటి ముఖ్యాంశాలు..)