https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/29/tdp.jpg?itok=-rmCR7uu
టీడీపీ కార్యాలయం వద్ద బైఠాయించిన బాధిత మహిళ లక్ష్మి

టీడీపీ ఇన్‌చార్జి మోసం.. మహిళ ధర్నా



కళ్యాణదుర్గం: గత ఎన్నికల్లో టీడీపీ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓటమిపాలై పార్టీ ఇన్‌చార్జిగా కొనసాగుతున్న ఉమామహేశ్వరనాయుడు, ఆయన సోదరుడు ఇంద్రసేనాచౌదరిల మోసాల బాగోతాన్ని మరోసారి ఓ మహిళ బయటపెట్టింది. ఇందులో భాగంగానే గురువారం టీడీపీ కార్యాలయం వద్ద బాధితురాలు లక్ష్మీ స్థానిక మహిళలతో కలిసి ధర్నాకు దిగింది. అంతకు ముందు ఉమామహేశ్వరనాయుడు సొంత కార్యాలయం వద్ద ధర్నా చేయాలని వెళ్లగా ఆయన లేకపోవడంతో పార్టీ కార్యాలయం వద్ద బైఠాయించింది. 

బిల్లులు ఇవ్వకపోవడంతో శివాజీ ఆత్మహత్య
ఉమామహేశ్వరనాయుడు, తమ్ముడు ఇంద్రసేనా చౌదరిల వద్ద బాధిత మహిళ లక్ష్మీ భర్త శివాజీ సబ్‌కాంట్రాక్టర్‌గా పనిచేశాడు. రెండేళ్ల క్రితం ఉరవకొండ ప్రాంతంలోని హెచ్‌ఎల్‌సీ కాలువ పనులకు సంబంధించి రూ.2 కోట్లు విలువ చేసే పనులు పూర్తి చేశారు. ఇంద్రసేనా చౌదరి పేరుతో వచ్చిన పనులను శివాజీ సబ్‌ కాంట్రాక్ట్‌తో పూర్తి చేశాడు. ఇందు కోసం ఆయన అప్పులు చేశారు. రావాల్సిన బిల్లులు రూ. 2 కోట్లు ఇవ్వకుండా అడపాదడపా రూ. 36 లక్షలు చెల్లించారు. పన్నులు పోను మిగిలిన రూ. 1.45 కోట్లు బిల్లులు ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడ్డారు. అప్పుల భారం భరించలేని లక్ష్మీ భర్త శివాజీ ఆత్మహత్య చేసుకున్నారు. 

కుమారుడినీ చంపుతామని బెదిరింపు
బిల్లుల కోసం ఎన్నోసార్లు ప్రాధేయపడినా ఇవ్వకుండా బెదిరించడం, చంపుతామని హెచ్చరించడం చేస్తున్నట్లు బాధితురాలు లక్ష్మీ తెలిపారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు దగ్గరకు ఐదుసార్లు వెళ్లివచ్చినట్లు బాధితురాలు తెలిపారు. చంద్రబాబు ఫోన్లో ఉమాకు డబ్బులు ఇవ్వాలని చెప్పినా ఫలితం లేకపోయింది. ఫోన్లు చేసి బిల్లు విషయమై నిలదీస్తే నీ కుమారుడు చైతన్యవర్మను కూడా చంపుతామని ఉమామహేశ్వరనాయుడు, ఆయన సోదరుడు ఇంద్రసేనా చౌదరిలు బెదిరిస్తున్నట్లు ఆమె తెలిపారు. తనతో పాటు తన కుమారుడి చావుకు ఉమా సోదరులే కారకులవుతారని తాను, తన కుమారుడు ఆత్మహత్య చేసుకుంటామని మీడియా వద్ద బాధిత మహిళ వాపోయింది. మహిళలతో కలిసి టీడీపీ కార్యాలయం వద్ద బాధిత మహిళ ధర్నా చేస్తుండగా ప్రజా సంఘాల నాయకులు శివశంకరనాయక్, నాగరాజు తదితరులు మద్దతు పలికారు. ఉమా వర్గానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు నాగరాజు కార్యాలయం వద్దకు చేరుకుని ధర్నా చేస్తున్న మహిళలను బెదిరించడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. న్యాయం జరిగే వరకు పోరాడతానని లక్ష్మీ స్పష్టం చేశారు.