ఉయ్యాల.. జంపాల
- ఏడుపదుల వయస్సులో బామ్మ అబ్బురపరిచే విన్యాసం
పుట్టపర్తి టౌన్: ఏడు పదుల వయస్సులో ఓ బామ్మ పదేళ్ల పిల్లలా తొక్కుటూయల ఊగుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. పుట్టపర్తి నగర పంచాయతీ బ్రాహ్మణపల్లికి చెందిన జయమ్మ వయస్సు 76 ఏళ్లు. ముగ్గురు కుమారులు, ఓ కుమార్తె సంతానం. ఈ వయస్సులోనూ జయమ్మ తన పనులు తానే చేసుకుంటోంది. వంట కూడా స్వయంగా వండుకుంటుంది. ఇదంతా ఒక ఎత్తయితే ఇంటి వద్దనున్న చింత చెట్టుకు తొక్కుటూయల వేసి అతివేగంగా ఊగుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. రాగులు, కొర్రలు, జొన్నలు, సంగటి, ఆకుకూరలు తినడం వల్లే తాను ఆరోగ్యంగా ఉన్నట్లు జయమ్మ చెబుతోంది. రోజూ వ్యాయామం, ఉదయాన్నే వాకింగ్ చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నట్లు తెలిపారు.