http://www.prajasakti.com/./mm/20200529//1590760398.Rashmika_Mandanna.jpg

ఆనందకరమైన చోట ఉన్నా : రష్మిక

నిత్యం సినిమా షూటింగ్‌లతో తీరిక లేకుండా ఉండే నటి రష్మిక మందన్నకు లాక్‌డౌన్‌ ఆనందాన్నిచ్చిందట. దక్షిణాది చిత్రాలతో నిత్యం సెట్స్‌లోనే ఉండే ఈ కథానాయిక కోవిడ్‌ -19 వల్ల కర్నాటకలోని తన స్వంత ఇంట్లోనే ఉండిపోయింది. రెండు నెలలుగా కుటుంబ సభ్యులతో గడుపుతోంది. ఈ సందర్భంగా ఆమె పొందిన అనుభూతులను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్టు చేసింది. 'నాకు 18 ఏళ్లు వచ్చే సరికి నా జీవితం పరుగుల పందెంలా మారిపోయింది. ఆ మార్కును(18 ఏళ్లు) ఇలా చేరుకున్నానో లేదో రేస్‌ మొదలైపోయింది. నా జీవితంలో ఇన్ని రోజులు పాటు ఎప్పుడూ ఇంట్లో ఉండలేదు. పాఠశాల దశ నుంచి ఉన్నత చదువుల వరకూ అంతా హాస్టల్‌లోనే గడిపాను. నేను టీనేజ్‌లోకి వచ్చినప్పుడు నా తల్లిదండ్రులు చాలా కఠినంగా ఉండేవారని అనుకునేదాన్ని' అని పేర్కొంది. సినిమా షూటింగుల్లో రష్మికకు తోడుగా తన తల్లి ఉంటుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ...రాత్రిపూట సినిమా షూటింగ్‌లు జరిగేటప్పుడు సెట్స్‌లో నాకు తోడుగా మా అమ్మగారు ఉంటే..ఇంటి దగ్గర కుటుంబానికి అండగా మా నాన్న ఉండేవారు. లాక్‌డౌన్‌ వల్ల ఇంట్లోనే నా కుటుంబ సభ్యులందరితోనూ గడిపే అవకాశం వచ్చింది. ఈ సమయంలో నా పని గురించి ఎప్పుడూ చర్చించకుండా హాయిగా గడిపేస్తున్నా. ఈ లాక్‌డౌన్‌ నాకు ఏ విషయాన్ని అయినా డీల్‌ చేసే శక్తినిచ్చింది. అందులో ఇదొక సంతోషకరమైన ప్రదేశంగా భావిస్తున్నా' అని పేర్కొంది. ఈ కథానాయిక ప్రస్తుతం అల్లు అర్జున్‌ హీరోగా రూపొందుతోన్న 'పుష్ప' చిత్రంలో కథానాయికగా చేస్తోంది. సుకుమార్‌ దర్శకత్వం. లాక్‌డౌన్‌ అనంతరం చిత్రీకరణ పున:ప్రారంభం కానుంది.