http://www.prajasakti.com/./mm/20200529//1590735727.Chief-Minister-KCR-inaugura.jpg

'కొండపోచమ్మ'కు గోదారి జలాల పరవళ్లు

* మార్కూజ్‌ పంప్‌హౌస్‌ ప్రారంభించిన కెసిఆర్‌
       సిద్ధిపేట : వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య సుదర్శన యాగం అనంతరం చినజీయర్‌ స్వామితో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ మర్కూజ్‌ పంప్‌హౌస్‌ను శుక్రవారం ప్రారంభించారు. స్విచ్‌ ఆన్‌ చేయగానే సముద్ర మట్టానికి 618 మీటర్ల ఎత్తున నిర్మించిన కొండపోచమ్మ సాగర్‌ రిజర్వాయర్‌లోకి గోదారి జలాలు పరువళ్లు తొక్కుతూ చేరుకున్నాయి. దీంతో గోదావరి జలాలను అరకిలోమీటరు ఎత్తుకు తీసుకెళ్లి లక్షలాది ఎకరాలకు నీరు అందించాలన్న కల సాకారమయ్యింది. ఇది కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అత్యంత కీలమైన దశకు అంకురార్పణ జరిగిన సందర్భంగా పలువురు కొనియాడారు. 15 టిఎంసిల సామర్థ్యం ఉన్న ఈ రిజర్వాయర్‌ ద్వారా 2.85 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. ఈ కార్యక్రమంలో సిఎం కెసిఆర్‌ వెంట మంత్రులు హరీష్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, ఎంపిలు సంతోష్‌కుమార్‌, కొత్త ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
       అంతకుముందు తెల్లవారుజాము నుంచే కొండపోచమ్మ దేవాలయంలో చండీయాగం, మర్కూక్‌ వద్ద సుదర్శన యాగం ప్రారంభం అయ్యాయి. ఉదయం 7 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ దంపతులు కొండపోచమ్మ దేవాలయంలో చండీయాగంలో భాగంగా నిర్వహించిన పూర్ణాహుతిలో పాల్గొన్నారు. అక్కడి నుంచి ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్న కేసీఆర్‌ ఎర్రవల్లి, మర్కూక్‌ గ్రామాల్లో నిర్మించే రైతు వేదికలకు శంకుస్థాపన చేశారు. అనంతరం మర్కూక్‌ వద్ద నిర్వహించిన సుదర్శన యాగం పుర్ణాహుతిలో కేసీఆర్‌, చినజీయర్‌ స్వామి పాల్గొన్నారు.