http://www.prajasakti.com/./mm/20200529//1590731734.rameshkumar21586521965.jpg

నిమ్మగడ్డను తిరిగి విధుల్లోకి తీసుకోండి : హైకోర్టు

* ప్రభుత్వ జారీ చేసిన జిఒలు కొట్టివేత
       అమరావతి : రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ తొలగింపుపై హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఇటీవల నిమ్మగడ్డ రమేష్‌కమార్‌ను తొలగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జిఒలను హైకోర్టు కొట్టేసింది. రమేష్‌ కుమార్‌ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆర్టికల్‌ 213 ప్రకారం ఆర్డినెన్స్‌ తీసుకొచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పింది. కొత్త ఎన్నికల కమిషనర్‌ నియామకం చెల్లదని చెప్పింది.
       కరోనా వ్యాప్తి కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా ఉన్న నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఆరువారాల పాటు వాయిదా వేసిన సంగతి తెలిసిందే.. దీంతో రాష్ట్ర ప్రభుత్వం టిడిపి నేతలు చెప్పినట్లుగా నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారని, దురుద్దేశ్యంతోనే ఎన్నికలను వాయిదా వేశారని హైకోర్టును ఆశ్రయించింది. అనంతరం జరిగిన పరిణామాలతో తనకు రక్షణ కల్పించాలని కేంద్రానికి నిమ్మగడ్డ లేఖ రాశారు. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే.. అనంతరం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను తొలగిస్తూ ప్రభుత్వం జిఒ జారీ చేసింది. కొత్త కమిషనర్‌ను నియమిస్తూ మరో జిఒను తీసుకొచ్చింది. దీనిని సవాల్‌ చేస్తూ నిమ్మగడ్డ, బిజెపి సీనియర్‌ నేత కామినేని శ్రీనివాసరావు రాష్ట్ర హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. దీంతో నిమ్మగడ్డ పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఇటీవల ఆదేశించింది. ఎన్నికల సంస్కరణల్లో భాగంగానే కమిషనర్‌ నిమ్మగడ్డను తొలగించామని ప్రభుత్వం తరుఫు లాయర్‌ హైకోర్టుకు నివేదించారు. అనంతరం హైకోర్టులో పలు విచారణలు జరిగాయి. నేడు జరిగిన విచారణలో భాగంగా హైకోర్టు పై విధంగా తీర్పు వెలువరించింది. దీంతో జగన్‌ సర్కార్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలినట్టయింది.
                                   న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం మరింత పెరిగింది : కామినేని
       హైకోర్టు తీర్పుపై బిజెపి సీనియర్‌ నేత కామినేని శ్రీనివాస్‌ హర్షం వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకం మరింత పెరిగిందన్నారు. బిజెపి అగ్రనేతలతో మాట్లాడిన తర్వాతే కోర్టులో పిల్‌ వేశామన్నారు. న్యాయం జరిగినట్టు భావిస్తున్నట్టు తెలిపారు. రాజ్యాంగ వ్యవస్థలో ఎక్కడో ఒకచోట సమస్యలకు పరిష్కారం దొరుకుతోందన్నారు. వ్యక్తిగత ఎజెండాతో జగన్‌ పని చేస్తున్నారని విమర్శించారు.
హైకోర్టు తీర్పు వెలువరించిన అనంతరం న్యాయవాది జంధ్యాల రవిశంకర్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఈ క్షణం నుంచి నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా కొనసాగుతారని పేర్కొన్నారు.