http://www.prajasakti.com/./mm/20200529//1590712552.midatalu-1.jpg

ముంచుకొస్తున్న మిడతల ప్రమాదం

         భారతావనిపై మిడతల దండు దాడి వార్తలు అందరినీ ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఎడారి మిడతలు పంటలను నాశనం చేస్తే 130 కోట్ల జనాభాగల దేశంలో ఆహార భద్రతకు పెనుముప్పు వాటిల్లుతుందేమోనన్న భయం తీవ్రంగా కలవరపరుస్తోంది. ఇప్పటికే రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌, గుజరాత్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లోని 60 జిల్లాల్లో మిడతల దండులున్నట్టు అధికారులు చెబుతున్నారు. భారత భూభాగంలో 20 శాతం మేరకు మిడతల దాడి ఉంటుందని కొందరు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. మిడతల దండుల ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి, సకాలంలో స్పందించి తగు చర్యలు సూచించడానికి కేంద్ర ప్రభుత్వ అధ్వర్యాన జోధ్‌పూర్‌ కేంద్రంగా 'లోకస్ట్‌ వార్నింగ్‌ ఆర్గనైజేషన్‌' చాలా దశాబ్దాలుగా పని చేస్తోంది. అయితే, గత ఏడాది ఆఫ్రికా ఖండంలో కురిసిన కుంభవృష్టి అనంతరం ఎడారి మిడతలు భారీగా సంతానోత్పత్తి కావడం, అవి సౌదీ అరేబియా, ఆఫ్ఘనిస్థాన్‌, పాకిస్థాన్‌ మీదుగా భారత్‌కు చేరే ప్రమాదం వుందని ముందస్తు హెచ్చరికలు వచ్చినా ఇప్పటి వరకూ భారత ప్రభుత్వం తగు చర్యలు చేపట్టక పోవడం
క్షంతవ్యం కాదు. మిడతలు చూడడానికి చిన్నవైనా అవి వేలు, లక్షల సంఖ్యలో దండుగా వచ్చి పంటలపై పడి తినేస్తే పెను విధ్వంసమే సంభవిస్తుంది. రోజుకు 150 కిలోమీటర్ల వరకూ ప్రయాణించగల ఈ ఎడారి మిడతలకు దేశాలు, ఖండాల ఎల్లలేమీ లేవు కనుక వాటి నష్టాన్ని నివారించడానికీ ఎల్లలు, అరమరికలు లేని అంతర్జాతీయ సమన్వయం ఎంతో అవసరం. అలాంటి పని చేయాల్సింది కేంద్ర ప్రభుత్వమే! అలాగే ఈ మిడతలు ఒకటి రెండు రాష్ట్రాలకు కూడా పరిమితం కాదు కనుక ఇది ఒక జాతీయ సమస్య.
మిడతలను అదుపు చేయడానికి, సంహరించడానికి ఇప్పటికే ఉత్తరాదిన కొన్ని జిల్లాల్లో ట్రాక్టర్లకు స్ప్రేయర్లను బిగించి రసాయనాలు పిచికారీ చేస్తున్నారు. కాని మిడతల విస్తృతికి, సాంద్రతకూ అవి చాలడం లేదు. పైనుండి రసాయన పిచికారీకి డ్రోన్లను వినియోగించడం ఇంకో మార్గం. ఇందుకు అవసరమైన చట్టపరమైన అనుమతులను కూడా పౌర విమానయాన శాఖ మంజూరు చేయాలి. అందుకు ఖర్చూ ఎక్కువగా వుంటుంది. వీటికి సంబంధించిన సన్నద్ధత కూడా సర్కారుకు అంతగా లేదు. మిడతల సంహారానికి శక్తివంతమైన స్ప్రేయర్లతో విష రసాయనాలను పిచికారీ చేయడం మరో మార్గం. అలాంటి స్ప్రేయర్లు మన దేశంలో లేవు కనుక విదేశాల నుండి దిగుమతి చేస్తున్నారు. బ్రిటన్‌ నుండి 60 స్ప్రేయర్లను కొనుగోలు చేశారుకానీ వాటిలో జూన్‌ రెండవ వారంలో 15, చివరి వారంలో 20, జూలైలో 25 భారత్‌కు వస్తాయని అధికారులు అంటున్నారు. వాస్తవంలో ఇంకా ఆలస్యం అయ్యే అవకాశమే ఎక్కువ. గత ఏడాది లోనే ముందస్తు హెచ్చరికలు వచ్చినా ఇప్పుడు దిగుమతి చేసుకోవడం చూస్తే 'ఇల్లు తగలబడుతుంటే బావి తవ్విన చందం'గా వుంది కేంద్ర ప్రభుత్వ నిర్వాకం.
ఇప్పటికే ఉత్తరాదిన తిష్ట వేసిన మిడతల దండులు ఛత్తీస్‌గఢ్‌ను తాకాయి. అవి ఏ క్షణంలోనైనా తెలుగు రాష్ట్రాలకు తరలివచ్చే ప్రమాదముంది. జూన్‌, జులైలో తెలుగు రాష్ట్రాల్లో వీటి ప్రభావం ఉండొచ్చునని శాస్త్రవేత్తలు అంటున్నారు. పంటలకు ఉన్న పచ్చని ఆకులన్నీ తినేస్తాయి. ప్రధానంగా వరి, పత్తి, మిర్చి పంటలకు తీవ్ర నష్టం కలిగిస్తాయి. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో 1993లో మిడతల ప్రభావంతో పంటలు దెబ్బ తిన్నాయి. ఇన్నేళ్ల తరువాత ముంచుకురానున్న ఈ ముప్పును అర్థం చేసుకోవడం, అంచనా వేయడం అధికార యంత్రాంగానికి అంత తేలిక కాదు. ఇలాంటి విపత్కర సమయాల్లో వ్యవసాయ, వాతావరణ శాస్త్రవేత్తల సలహాలు, సూచనలూ ఎంతో అవసరం. ముందస్తు హెచ్చరికల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వాలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు త్వరితగతిన కదలాలి. కేంద్ర ప్రభుత్వంతోను, ఇతర రాష్ట్రాలతోనూ సమన్వయం చేసుకోవడం, పాలనాపరమైన చర్యలు చేపట్టడంతోబాటు రైతాంగాన్ని అప్రమత్తం చేయాలి. మిడతలు పొలాల్లోకి ప్రవేశించకుండా ముందుగానే మంటలు వేయడం వంటివి క్షేత్రస్థాయిన జరగాలి. తెలంగాణ ముఖ్యమంత్రి గురువారంనాడు అధికారులు, శాస్త్రవేత్తలతో సమీక్షా సమావేశం నిర్వహించడం మంచిదే! వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి కూడా అలాంటి సమీక్ష చేపట్టి యంత్రాంగానికి దిశా నిర్దేశం చేయాలి. ఇది రాష్ట్రంలో పంటల సంరక్షణకు, యావత్‌ ప్రజానీకానికి సంబంధించిన అంశం కనుక రాజకీయ పార్టీలు, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు, స్వచ్ఛంద సంస్థలను భాగస్వాములను చేయాలి. ఇప్పటికే కరోనాతో ప్రపంచ దేశాల్లో ఆహార కొరత ఏర్పడుతోంది. మిడతలు దాడి చేసి పంటలను సర్వనాశనం చేస్తే అది మరింత పెరగవచ్చు. అందరూ అప్రమత్తమై మిడతల దండు ప్రమాదాన్ని నివారించాలి.