http://www.prajasakti.com/./mm/20200529//1590763313.arun-dhumal.jpg

ఆ షెడ్యూల్‌ ఫైనల్‌ కాదు : బిసిసిఐ కార్యదర్శి అరుణ్‌ ధుమాల్‌

ముంబయి: క్రికెట్‌ ఆస్ట్రేలియా(సిఏ) గురువారం ప్రకటించిన భారతజట్టు పర్యటన షెడ్యూల్‌ ఫైనల్‌ కాదని బిసిసిఐ కార్యదర్శి అరుణ్‌ ధుమాల్‌ శుక్రవారం అభిప్రాయపడ్డారు. సిఏ ప్రకటించిన షెడ్యూల్‌ ఎనిమిదేళ్ల ఫ్యూచర్‌ టూర్‌ ప్రోగ్రామ్‌(ఎఫ్‌టిపి)లో భాగంగా గతంలోనే అంతర్జాతీయ క్రికెట్‌మండలి(ఐసిసి) ఖరారు చేసిందన్నారు. ఆ షెడ్యూల్‌లో భాగంగా భారతజట్టు అక్టోబర్‌ 11, 14, 17న మూడు టి20 సిరీస్‌ ఆడాల్సి ఉందని, అక్టోబర్‌ 18నుంచి టి20 ప్రపంచకప్‌ టోర్నీ జరగాల్సి ఉన్నా.. దానిపై సిఏ ప్రకటనా చేయకపోవడమే ఇందుకు కారణమన్నారు. కేవలం 2020-21 హోమ్‌ సీజన్‌ షెడ్యూల్‌ను మాత్రమే ప్రకటించడంతో టి20 ప్రపంచకప్‌ వాయిదా పడడం ఖాయమన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వరల్డ్‌కప్‌ నిర్వహించడం సవాల్‌తో కూడకున్న పని అని సిఏ సిఇవో కెవిన్‌ రాబర్ట్స్‌ పేర్కొనడమే ఇందుకు ఉదాహరణ అన్నారు. దీని కారణంగా భారతజట్టు అక్టోబర్‌లో ఆస్ట్రేలియాకు వెళ్లడం, మళ్లీ వెనక్కు రావడం, తిరిగి అక్కడకు పయనం కావడంవల్ల ఉపయోగమేమిటి? అని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ పర్యటనలో మార్పులు జరగడం తప్పదన్నారు.
టి20 ప్రపంచకప్‌ కష్టమే: మోర్గాన్‌
ఈ ఏడాది టి20 ప్రపంచకప్‌ జరగడం కష్టమేనని ఇంగ్లండ్‌ వన్డే జట్టు కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ అభిప్రాయపడ్డాడు. ఈ టోర్నీ అనుకున్న ప్రకారం జరిగితే నిజంగా ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే కరోనా వైర్‌సను అరికట్టేందుకు ఆసీస్‌ ముందుగానే వారు తమ సరిహద్దులను మూసేసిందని, అందుకే మిగతా దేశాలతో పోలిస్తే అక్కడ పాజిటివ్‌ కేసులు తక్కువగా ఉంటున్నాయన్నారు. ఇలాంటి స్థితిలో ఒక్కసారిగా విదేశాల నుంచి 16 జట్ల ఆటగాళ్లు వచ్చి వివిధ వేదికల్లో క్రికెట్‌ మ్యాచ్‌లు ఆడేందుకు అనుమతిస్తే కరోనా తీవ్రత పెరగవచ్చని మోర్గాన్‌ పేర్కొన్నాడు.