http://www.prajasakti.com/./mm/20200529//1590727976.KURNOOLBUS.jpg

ఆస్పత్రి నుంచి కరోనా పేషెంట్‌ మాయం.. ఆర్‌టిసి బస్సులో ప్రత్యక్షం..

* తోటి ప్రయాణికుల్లో భయాందోళనలు
         కర్నూలులోని సర్వజన వైద్యశాలలో డాక్టర్ల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ఇప్పటికే వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఆస్పత్రిలో వైద్యులకే కరోనా సోకిన సంగతి తెలిసిందే.. తాజాగా అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ కరోనా బాధితురాలు వైద్యుల కళ్లుగప్పి నిన్న ఆస్పత్రి నుంచి పారిపోయింది. దీంతో అధికారులుకు చెమటలు పట్టాయి. ఎక్కడ వెతికినా కనిపించకపోవడంతో టెన్షన్‌ పడ్డారు. చివరికి ఓ ఆర్‌టిసి బస్సులో వెళుతున్నట్లు తెలియడంతో అక్కడికి పరుగులు తీశారు. ఆదోనికి చెందిన వద్ధురాలికి కరోనా పాజిటివ్‌ తేలడంతో రెండు రోజుల క్రితం కర్నూలు సర్వజన ఆస్పత్రికి తరలించారు. గురువారం ఉదయం టాబ్లెట్లు, మందులు తెచ్చుకోవాలని వార్డులో చెప్పి బయటకు వెళ్లింది. అక్కడి నుంచి నేరుగా వెళ్లి ఆర్‌టిసి బస్సు ఎక్కింది. ఆమె కనిపించకపోవడంతో షాక్‌ తిన్న అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. అందరూ కలిసి వెంటనే గాలింపు మొదలు పెట్టారు. వద్ధురాలి కోసం గాలిస్తుండగా కొడమూరు సమీపంలో ఓ ఆర్‌టిసి బస్సులో ప్రత్యక్షమైంది. ఆమెను పట్టుకుని మళ్లీ ఆస్పత్రికి తరలించారు. ఆ బస్సులో ప్రయాణిస్తున్న 27 మందినీ మరో బస్సులో పంపించి బస్సును శానిటైజ్‌ చేసేందుకు బస్టాండ్‌కు తరలించారు. ఆమె ఎక్కిన బస్సులో ఉన్న ప్రయాణికుల్లో భయాందోళనలు మొదలయ్యాయి.