హైదరాబాద్ సహా 13 నగరాలపై సమీక్ష
సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్‌తో తీవ్రంగా ప్రభావితమైన 13 నగరాల్లో పరిస్థితిపై కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా గురువారం సమీక్షించారు. హైదరాబాద్ సహా 13 నగరాల్లోనే 70 శాతం కరోనా పాజిటివ్ కేసులు నమోదైనందున ఆయా నగరాల మున్సిపల్ కమిషనర్లు, జిల్లా కలెక్టర్లతో కేబినెట్ కార్యదర్శి సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. ఈ సమావేశానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులూ హాజరయ్యారు. హైదరాబాద్, ముంబై, చెన్నై, ఢిల్లీ/న్యూఢిల్లీ, అహ్మదాబాద్, థానే, పుణే, కోల్‌కతా/హౌరా, ఇండోర్, జైపూర్, జోధ్‌పూర్, చెంగల్పట్టు, తిరువల్లూరు నగరాల్లో కోవిడ్ పరిస్థితులపై చర్చించారు.
కేసుల నిర్వహణ కోసం తీసుకున్న చర్యలను సమావేశంలో సమీక్షించారు. పట్టణ ప్రాంతాల్లో కోవిడ్ నిర్వహణపై కేంద్రం ఇప్పటికే మార్గదర్శకాలను జారీ చేసింది. పాజిటివ్ కేసుల రేటు, రెట్టింపు రేటు, టెస్టుల సంఖ్య తదితర అంశాలపై దృష్టిపెట్టేలా మార్గదర్శకాలు ఉన్నాయి. కేసులు, భౌగోళిక వ్యాప్తి వంటి అంశాల ఆధారంగా కంటైన్మెంట్ జోన్లను భౌగోళికంగా నిర్వచించాలని కేంద్రం నొక్కి చెప్పింది. తద్వారా లాక్‌డౌన్ నియమావళిని అమలు చేయడంలో సహాయపడుతుంది. రెసిడెన్షియల్ కాలనీలు, బస్తీలు, మునిసిపల్ వార్డులు లేదా పోలీస్ స్టేషన్ పరిధి ప్రాంతాలు, మునిసిపల్ జోన్లు, పట్టణాలను అవసరమైన విధంగా కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించవచ్చా అన్న అంశాన్ని మునిసిపల్ కార్పొరేషన్లు నిర్ణయించవచ్చు.