https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/29/nif.jpg?itok=TMvffPk8

మార్కెట్లకు సెంటిమెంట్‌ బూస్ట్‌



ముంబై: అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో సానుకూలతలు దేశీయ ఈక్విటీ మార్కెట్లకు మద్దతుగా నిలిచాయి. డెరివేటివ్స్‌లో మే నెల కాంట్రాక్టుల ఎక్స్‌పైరీ చివరి రోజున ఇన్వెస్టర్లు షార్ట్‌ కవరింగ్, రోలోవర్‌కు మొగ్గు చూపడంతో దేశీయ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాలను మూటగట్టుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం నుంచి ఆర్థిక వ్యవస్థలు తెరిపిన పడుతున్న సంకేతాలు దేశీయ ఇన్వెస్టర్లలో సానుకూల సెంటిమెంట్‌కు మద్దతిచ్చాయి. దాదాపు అన్ని సూచీలు లాభాలు గడించాయి. షార్ట్‌ కవరింగ్‌ కారణంగా మార్కెట్‌ వ్యాప్త ర్యాలీ చోటు చేసుకున్నట్టు అనలిస్టులు పేర్కొన్నారు.

సెన్సెక్స్‌ 595 పాయింట్లు లాభపడి (1.88 శాతం) 32,201 వద్ద, నిఫ్టీ 175 పాయింట్లు (1.88 శాతం) పెరిగి 9,490 వద్ద ముగిశాయి. ‘‘ఈయూ నుంచి భారీ ఉద్దీపనల ప్యాకేజీ యూరోపియన్‌ షేర్ల ర్యాలీకి కారణమైంది. అయితే చైనా–అమెరికా మధ్య దౌత్యపరమైన అంశాలు ఆసియా మార్కెట్లపై ప్రభావం చూపించాయి. ఇక దేశీయంగా వైరస్‌ కేసులు అధిక స్థాయిల్లోనే ఉన్నప్పటికీ ఆర్థిక కార్యకలాపాల పునఃప్రారంభంతో మార్కెట్లు ర్యాలీ చేశాయి. ప్రభుత్వం నుంచి తదుపరి ఉద్దీపనల చర్యలు ఆర్థిక వ్యవస్థలో డిమాండ్‌ పెంచేందుకు తోడ్పడతాయని, ప్రభావిత రంగాలకు సాయంగా నిలుస్తాయన్న అంచనాలు ఉన్నాయి. క్షేత్ర స్థాయిలో పెద్దగా మార్పుల్లేకపోయినప్పటికీ ఈ అంచనాల మద్దతుతోనే మార్కెట్లు లాభపడ్డాయి’’ అని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ తెలిపారు.  

లాభపడినవి ఇవే..  
అన్ని రంగాల సూచీలు లాభపడగా.. అత్యధికంగా బీఎస్‌ఈ క్యాపిటల్‌ గూడ్స్‌ 5.11% ర్యాలీ చేసింది. ఆ తర్వాత ఆటో, ఇండస్ట్రియల్స్, ఫైనాన్స్, రియల్టీ, బ్యాంకెక్స్, మెటల్‌ సూచీలు ఎక్కువగా లాభపడ్డాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్‌ కూడా ఒకటిన్నర శాతం వరకు పెరిగాయి. సెన్సెక్స్‌లో ఎల్‌అండ్‌టీ అత్యధికంగా 6% పెరిగింది.  హీరో మోటోకార్ప్, ఇండస్‌ఇండ్‌ , హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, మారుతి, హెచ్‌డీఎఫ్‌సీ, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంకు ఎక్కువగా లాభపడిన వాటిల్లో ఉన్నాయి.