అనిశ్చితిలో ఇంకా ఏం చేద్దాం!
- దేశ ఆర్థిక పరిస్థితిపై ఎఫ్‌ఎస్‌డీసీ దృష్టి
న్యూఢిల్లీ: కోవిడ్–19 ప్రతికూలతల నేపథ్యంలో గురువారం దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులపై ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (ఎఫ్‌ఎస్‌డీసీ) దృష్టి సారించింది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈ కీలక సమావేశానికి అధ్యక్షత వహించారు. కరోనా వైరస్ సంక్షోభం దేశంలో ప్రారంభమైన తర్వాత కౌన్సిల్ సమావేశం ఇదే తొలిసారి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ 22వ కౌన్సిల్ సమావేశంలో ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, సెబీ చీఫ్ అజయ్ త్యాగి, ఐఆర్‌డీఏఐ చైర్మన్ సుభాష్ చంద్ర కుంతియా, ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబీబీఐ) చైర్మన్ ఎంఎస్ సాహూ, పీఎఫ్‌ఆర్‌డీఏఐ చైర్మన్ సుప్రీతం బందోపాధ్యాయ పాల్గొన్నారు. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి తరుణ్ బజాజ్, రెవెన్యూ కార్యదర్శి అజయ్ భూషన్ పాండే, ఫైనాన్షియల్ సేవల కార్యదర్శి దేబాషిస్ పాండా సహా ఆర్థికశాఖ పలువురు సీనియర్ అధికారులు కూడా ఈ భేటీలో ఉన్నారు. సమావేశానికి సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు చూస్తే...
► దేశంలో ద్రవ్యలభ్యత పరిస్థితులను మెరుగుపరిచే చర్యలు మరిన్ని తీసుకోవాలని, ఫైనాన్షియల్ సెక్టార్‌లో మూలధన అవసరాలను ఎప్పటికప్పుడు తీర్చాలని ఎఫ్‌ఎస్‌డీసీ భావించింది.
► మార్కెట్ ఒడిదుడుకులు, దేశీయంగా ఆర్థిక వనరుల సమీకరణ, అంతర్జాతీయ పెట్టుబడులు వంటి కీలక అంశాలపై సమావేశం చర్చించింది.
► కోవిడ్–19 గ్లోబల్ ఫైనాన్షియల్ వ్యవస్థ స్థిరత్వానికి ముప్పును తెచ్చిపెట్టిందనీ, రికవరీ ఎప్పుడన్నది సైతం ఇప్పుడే చెప్పడం కష్టమని పేర్కొంది.