https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/28/TDP-8.jpg?itok=LzKSvWjb

పొరపాట్లు జరిగితే మర్చిపోండి



సాక్షి, అమరావతి: పార్టీలో ఎక్కడైనా పొరపాట్లు జరిగితే మర్చిపోవాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు కార్యకర్తల్ని కోరారు. పొరపాట్లు మళ్లీ జరక్కుండా చూసుకుంటానని, అందరూ పార్టీ కోసం పనిచేయాలన్నారు. భవిష్యత్తు అవసరాల్ని బట్టి పార్టీ యంత్రాంగాన్ని తయారుచేస్తానని తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి బుధవారం జూమ్‌ వెబ్‌నార్‌ ద్వారా తెలుగుదేశం పార్టీ   నిర్వహించిన మహానాడులో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. తొలుత పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఎన్టీఆర్‌ విగ్రహానికి చంద్రబాబు నివాళులర్పించారు. అనంతరం.. మృతిచెందిన పార్టీ నేతలు, కార్యకర్తలు, ఎల్‌జీ పాలిమర్స్‌ దుర్ఘటన మృతులకు సంతాపం తెలిపారు. పార్టీ ఏపీ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు, ఎల్‌ రమణ మాట్లాడిన తర్వాత చంద్రబాబు ప్రసంగించారు. గడచిన సంవత్సరం చాలా బాధాకరమైనదని.. ఒడిదుడుకులు ఎదుర్కొన్నామని.. ఈ ఏడాదిలో ఎదుర్కొన్నన్ని సమస్యలు ఎప్పుడూ లేవని, పార్టీ నాయకుల్ని అన్ని రకాలుగా దెబ్బతీశారని చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. 

► పోలవరం ప్రాజెక్టు సంక్షోభంలో ఉంది. కేంద్రం నుంచి డబ్బులు వస్తాయో లేదో తెలీదు. ఇప్పుడు పోతిరెడ్డిపాడుపై ప్రభుత్వం జీఓ ఇచ్చింది. పోతిరెడ్డిపాడు తీసుకొచ్చింది మనమే. రాయలసీమకు కృష్ణా జలాలను బనకచర్ల మీదుగా తీసుకెళ్లేలా ప్లాన్‌ చెప్పా.  
► సంవత్సరంలో 34 సంక్షేమ కార్యక్రమాలను రద్దుచేశారు. పెట్టుబడులు పోయాయి. రైతులు దివాళా తీశారు. వారికి మద్దతు ధర ఇచ్చే పరిస్థితిలేదు.  
► 2016లో చేసిన నిర్ణయాన్ని రివర్స్‌ చేశామంటున్నారు. ఆస్తుల వేలం నిలిపేసి క్షమాపణ చెప్పాలి. తిరుమల ఆస్తులను చౌకగా కొట్టేయాలని చూస్తున్నారు.  
► ఎల్‌జీ గ్యాస్‌ ఘటనలో మృతుల కుటుంబాలకు పార్టీ తరఫున ఒక్కొక్కరికి రూ. 50 వేల చొప్పున ఇస్తాం. 
► కరెంటు ఛార్జీలు పెంచారు. మద్యం, ఇసుక, సిమెంటు అన్ని రేట్లు పెంచేశారు. ఇరిగేషన్‌లో ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు. ప్రత్యేక హోదా ఏమైంది.  
► రూ.80 వేల కోట్ల అప్పులు చేశారు. వాటితో అభివృద్ధి చేయలేదు.   

ఏడు తీర్మానాలు.. సీఎం జగన్‌పై ఆరోపణలకే 
మహానాడులో తొలిరోజు ఏపీకి సంబంధించి ఏడు తీర్మానాలు చేయగా అవన్నీ సీఎం వైఎస్‌ జగన్, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపైనే పెట్టడం గమనార్హం.  
8 ‘విద్యుత్‌ చార్జీల పెంపు–మాట తప్పిన జగన్‌’ తీర్మానాన్ని విజయవాడ ఎంపీ కేశినేని నాని.. ‘కరోనా విజృంభణ–వలస కార్మికుల కష్టాలు’ తీర్మానం గుంటూరు ఎంపీ జయదేవ్‌.. ‘టీటీడీ ఆస్తుల అమ్మకం’పై వేమూరి ఆనంద్‌సూర్య.. ‘అరాచక పాలనకు ఏడాది’ తీర్మానాన్ని వర్ల రామయ్య.. ‘అన్నదాత వెన్నువిరిచిన జగన్‌ సర్కార్‌’ తీర్మానాన్ని సోమిరెడ్డి.. ‘సంక్షోభంలో సాగునీటి ప్రాజెక్టులు’ తీర్మానాన్ని కాల్వ శ్రీనివాసులు.. ‘అక్రమ కేసులు–ఆస్తుల విధ్వంసం’ తీర్మానాన్ని అయ్యన్నపాత్రుడు ప్రవేశపెట్టారు. తెలంగాణకి సంబంధించి రెండు తీర్మానాలు రేపటికి వాయిదా వేశారు. 

ముగ్గురు ఎమ్మెల్యేల గైర్హాజరు 
తొలిరోజు మహానాడుకు ముగ్గురు ఎమ్మెల్యేలు గైర్హాజరైనట్లు తెలిసింది. విశాఖ నార్త్‌ ఎమ్మెల్యే, మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు, గుంటూరు జిల్లా రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, ప్రకాశం జిల్లా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పాల్గొనలేదని టీడీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇంకా పలువురు ముఖ్య నేతలూ సమావేశానికి దూరంగా ఉన్నారు. మరో ముగ్గురు ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాల గిరిలు ఇప్పటికే పార్టీకి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.  

మొక్కుబడి తంతే..  
కరోనా నేపథ్యంలో జూమ్‌ వెబ్‌నార్‌ ద్వారా నిర్వహించిన మహానాడు మొక్కుబడి తంతులా జరగడంతో నేతలు, కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తంచేశారు. చంద్రబాబు ప్రతిరోజూ చేపట్టే వీడియో కాన్ఫరెన్స్‌లానే ఉంది తప్ప మహానాడులా లేదని పార్టీ సీనియర్లు పెదవి విరిచారు. కాసేపటికే విసుగొచ్చి చాలామంది లైన్‌కట్‌ చేసినట్లు తెలిసింది. ప్రారంభంలోనే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు లైన్‌ సరిగా లేకపోవడంతో ఆయన ప్రసంగాన్ని మధ్యలోనే కట్‌ చేశారు. మంగళగిరి పార్టీ కార్యాలయానికి ఒకేసారి నాయకులంతా వచ్చి లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించారు. జెండా ఆవిష్కరణ, ఎన్టీఆర్‌కి నివాళులర్పించేటప్పడు నాయకులంతా భౌతికదూరాన్ని బేఖాతర్‌ చేశారు.