https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/28/Yasangi.jpg?itok=39lh2ruU

రాష్ట్రం... ధాన్య భాండాగారం



సాక్షి, హైదరాబాద్‌: దేశ వ్యాప్తంగా యాసంగి సీజన్‌ ధాన్యం సేకరణలో తెలంగాణ నంబర్‌వన్‌ స్థానంలో ఉందని భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) ప్రకటించింది. దేశం మొత్తం మీద ఈ సీజన్‌లో 83.01 లక్షల మెట్రిక్‌ టన్నుల మేర ధాన్యం సేకరణ జరగ్గా, ఒక్క తెలంగాణ సొంతంగా 52.23 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించి సరికొత్త రికార్డులు సృష్టించిందని తెలిపింది. ఇప్పటికే తెలంగాణ æ91.07 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకోగా సగానికి పైగా సేకరణపూర్తి చేసిందని వెల్లడించింది. ఇక ఆంధ్రప్రదేశ్‌ సైతం రికా ర్డు స్థాయిలో 23.04లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించిందని పేర్కొంది. ఈ మేరకు బుధవారం భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) సీఎండీ వి.వి.ప్రసాద్‌ పత్రికా ప్రకటన విడుదల చేశారు.  

పంజాబ్, ఎంపీలనుంచి గోధుమల సేకరణ.. 
ఇక గత ఏడాది దేశ వ్యాప్తంగా 3.41 కోట్ల మెట్రిక్‌ టన్నుల గోధుమల సేకరణ చేయగా, ఈ ఏడాది ఇప్పటికే గత ఏడాదికి మించి 3.42కోట్ల మెట్రిక్‌ టన్నుల గోధుమ సేకరణ పూర్తయిందని వెల్లడించారు. పంజాబ్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి అధికంగా గోధుమల సేకరణ జరిగిందని తెలిపారు. ప్రస్తుత లాక్‌డౌన్‌ పరిస్థితుల దృష్ట్యా, కొనుగోళ్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, రవాణా, నిల్వల విషయంలో రాష్ట్రాలతో సమన్వయం చేస్తున్నామని వివరించారు. దేశంలోని పౌరులకు ఆహార ధాన్యాల కొరత లేకుండా చూసేందుకు ప్రధానమంత్రి గరీభ్‌ కల్యాణ్‌ యోజన పథకం కింద తెలంగాణకు ఏప్రిల్, మే, జూన్‌ నెలల అవసరాలకు కలిపి మొత్తంగా 2.87 లక్షల మెట్రిక్‌ టన్నుల మేర బియ్యం సరఫరా చేసినట్లు వెల్లడించారు. కేంద్రం అందించిన బియ్యం రాష్ట్రంలోని 1.91కోట్ల మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చిందని తెలిపారు. దీంతో పాటే తెలంగాణలోని వలస కార్మికులకు ఆహార కొరత లేకుండా వారికి నెలకు 5 కిలోల బియ్యం పంపిణీకోసం అదనంగా మరో 19,162 మెట్రిక్‌ టన్నుల బియ్యం అదనంగా అందించినట్లు వెల్లడించారు. ఇక లాక్‌డౌన్‌ మొదలైన నాటినుంచి ఇంతవరకు తెలంగాణనుంచి 495 రైళ్ల ద్వారా 13 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని కర్ణాటక, తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్, జార్ఖండ్‌ రాష్ట్రాలకు తరలించినట్లు తెలిపారు.