https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/28/lock.jpg?itok=-Bi3dM2G

లాక్‌డౌన్‌ 5.0!

న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి కట్టడికి దేశవ్యాప్త లాక్‌డౌన్‌ మరి కొన్నాళ్లు కొనసాగుతుందనే సంకేతాలు వస్తున్నాయి. లాక్‌డౌన్‌ 5.0 ఉంటుందనే సమాచారం ఢిల్లీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. మే 31 తర్వాత మరో రెండు వారాల పాటు లాక్‌డౌన్‌ కొనసాగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ లాక్‌డౌన్‌లో 70% పైగా కేసులు నమోదైన 11 ప్రధాన నగరాల పైననే ప్రధానంగా దృష్టి పెట్టే అవకాశముంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్, పుణే, థానే, జైపూర్, సూరత్, ఇండోర్‌లో కఠిన ఆంక్షల కొనసాగింపు ఉంటుందని తెలుస్తోంది. (ఆర్థిక రాజధాని అతలాకుతలం)

లాక్‌డౌన్‌లో గుడులు, ఇతర ప్రార్థన స్థలాలను పునః ప్రారంభించేందుకు అనుమతించే అవకాశముంది. మాస్క్‌లు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ దేవాలయాలకు వెళ్లేందుకు అనుమతించవచ్చు. సామూహిక ప్రార్థనలు, మత పరసామూహిక కార్యక్రమాలను అనుమతించకపోవచ్చని తెలుస్తోంది. సినిమాహాళ్లు, స్కూళ్లు, కాలేజీలు, ఇతర విద్యా సంస్థలు, షాపింగ్‌ మాల్స్, ప్రజలు భారీగా గుమికూడే అవకాశమున్న ఇతర ప్రాంతాల మూసివేత ఐదో దశ లాక్‌డౌన్‌లోనూ కొనసాగనుందని తెలుస్తోంది. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో లాక్‌డౌన్‌ సాధించిన ఫలితాలపై ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. (లాక్డౌన్ 5.0 : నగరాలపై ఫోకస్)