https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/28/HIGH-COURT.jpg?itok=Zb4Dnx54

పిల్‌ ముసుగులో రాజకీయాలు



సాక్షి, అమరావతి: ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) ముసుగు వేసుకుని రాజకీయాలకు న్యాయస్థానాలను వేదికలుగా వాడుకుంటున్నారని అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. ఇలాంటి రాజకీయ ప్రేరేపిత వ్యాజ్యాలను ఉపేక్షించరాదన్నారు. పిల్‌ దాఖలు చేసి ప్రభుత్వం నిధులను ఎలా ఖర్చు చేయాలో కూడా నిర్దేశిస్తున్నారంటే, పరిస్థితి ఎక్కడ వరకు వచ్చిందో కోర్టులు గమనించాలని కోరారు. ఇటువంటి వ్యాజ్యాలను అణిచివేయాల్సిన సమయం ఆసన్నమైందని వివరించారు. భూముల విక్రయాలను అడ్డుకోవాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా పొన్నవోలు వాదనలు వినిపించారు.

సంక్షేమ పథకాలను విస్తృత స్థాయిలో అమలు చేసేందుకు అవసరమైన నిధులను సమీకరించేందుకు ప్రభుత్వం భూములను విక్రయిస్తుంటే, వాటిని అడ్డుకునేందుకు విజయవాడకు చెందిన కన్నెగంటి హిమబిందు, గుంటూరుకు చెందిన డాక్టర్‌ మద్దిపాటి శైలజ వ్యాజ్యాలు వేశారని, అసలు ఈ వ్యాజ్యాలు దాఖలు చేసేందుకు వీరికి ఉన్న అర్హత ఏమిటో న్యాయస్థానం విచారించాల్సిన అవసరముందన్నారు. ప్రభుత్వ భూముల విక్రయం విషయంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడానికి జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌ నేతృత్వంలోని ధర్మాసనం నిరాకరించిందని, కౌంటర్‌ దాఖలుకు విచారణను గురువారానికి వాయిదా వేసిందని తెలిపారు.

వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, భూముల విక్రయంపై తాజాగా దాఖలైన వ్యాజ్యాలను ఇప్పటికే దాఖలైన వ్యాజ్యంతో జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ న్యాయమూర్తులు జస్టిస్‌ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్‌ బొప్పూడి కృష్ణమోహన్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులిచ్చింది. హిమబిందు, శైలజ వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలపై ధర్మాసనం విచారణ జరిపింది. శైలజ తరఫున న్యాయవాది డీఎస్‌ఎన్‌వీ ప్రసాద్‌ బాబు, హిమబిందు తరఫున న్యాయవాది బి.నళిన్‌కుమార్‌ వాదనలు వినిపించారు. అందరి వాదనలు విన్న జస్టిస్‌ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం ఇదే అంశంపై జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌ నేతృత్వంలో ధర్మాసనం విచారణ జరుపుతున్న నేపథ్యంలో దీనిని కూడా అదే ధర్మాసనం ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.