https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/28/cov.jpg?itok=FSCu9wCi

లక్షన్నర దాటిన పాజిటివ్‌ కేసులు



న్యూఢిల్లీ/డెహ్రాడూన్‌: 1,51,767 పాజిటివ్‌ కేసులు, 4,337 మరణాలు. దేశంలో కరోనా  సృష్టించిన విలయమిది. దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నానాటికీ పెరిగిపోతోంది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 24 గంటల వ్యవధిలో కొత్తగా 6,387 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 170 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు మొత్తం కేసులు 1,51,767కు, మరణాలు 4,337కు చేరాయని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. భారత్‌లో ప్రస్తుతం యాక్టివ్‌ కరోనా కేసులు 83,004 కాగా, 64,425 మంది బాధితులు చికిత్సతో పూర్తిగా కోలుకున్నారు.  వలస కూలీలు స్వస్థలాలకు తిరిగి వస్తుండడంతో ఉత్తరాఖండ్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి విపరీతంగా పెరిగిపోతోంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు రెట్టింపయ్యేందుకు మే 17 నాటికి 16 రోజులు పట్టగా, ప్రస్తుతం 4 రోజులే పడుతోంది. ఇక్కడ మే 17 నాటికి 92 కేసులు నమోదు కాగా, ప్రస్తుతం ఆ సంఖయ్య 438కి చేరింది.

3న పార్లమెంటరీ స్థాయీ సంఘం భేటీ
దేశీయ వ్యవహారాలపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీ సంఘం జూన్‌ 3న సమావేశం కానుంది. ఆ రోజు తమ ముందు హాజరై కరోనా నియంత్రణకు చేపట్టిన చర్యలు, రాష్ట్రాలతో సమన్వయం, లాక్‌డౌన్‌ అమలు తీరును వివరించాలంటూ ఈ స్థాయీ సంఘం కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లాకు ఆదేశాలు జారీ చేసింది. ఈ సంఘానికి సీనియర్‌ కాంగ్రెస్‌ నేత ఆనంద్‌కుమార్‌ నేతృత్వం వహిస్తున్నారు. లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చిన అనంతరం జూన్‌ 3న తొలిసారిగా భేటీ కానుంది.