తగ్గుతున్న ఉష్ణతాపం
- ద్రోణి ప్రభావంతో రెండు రోజుల పాటు చిరు జల్లులు
- విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు
సాక్షి,విశాఖపట్నం: రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. వడగాడ్పుల తీవ్రత ఒకట్రెండు రోజులున్నా.. ఎండలు మాత్రం అంతగా ఉండవని
వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాయలసీమ నుంచి తమిళనాడు వరకూ సముద్రమట్టానికి 1.5 కి.మీ. ఎత్తులో ఉపరితల ద్రోణి విస్తరించి ఉండటమే దీనికి కారణమంటున్నారు.
ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే సూచనలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలో మాత్రం గురు, శుక్రవారాల్లో ఒకట్రెండు చోట్ల 40 నుంచి 43 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. నైరుతి రుతు పవనాలు చురుగ్గా కదులుతున్నాయి. కేరళ తీరాన్ని ఎప్పుడు తాకుతాయన్నదానిపై రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని అధికారులు చెప్పారు.