https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/28/HC.jpg?itok=q0A_GnuR

ఆ డాక్టర్లపై చర్యలు తీసుకుంటారా లేదా?



సాక్షి, హైదరాబాద్‌: గద్వాల జిల్లాకు చెందిన గర్భిణి జెనీలా (20)కు కరోనా పరిస్థితుల కారణంగా వైద్యం చేసేందుకు నిరాకరించి, ఆమె మృతికి కారణమైన ఆరుగురు డాక్టర్లపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి క్రిమినల్‌ చర్యలు తీసుకుంటారో లేదో తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలకే పరిమితం కావద్దని, ఇది క్రిమినల్‌ కేసులు నమోదు చేయాల్సిన ఘటన అని హైకోర్టు అభిప్రాయపడింది. కరోనా వైరస్‌ వ్యాప్తి ఉందని చెప్పి ఆమెకు వైద్యం చేసేందుకు నిరాకరించిన ఆరుగురు మహిళా డాక్టర్లపై శాఖాపర విచారణ జరిపి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌ చేసిన వాదనతో ధర్మాసనం ఏకీభవించలేదు.

ప్రాథమిక ఆధారాలు ఉన్నప్పుడు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి క్రిమినల్‌ చర్యలు తీసుకోవాల్సిందేనని, ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకునేదీ లేనిదీ స్పష్టం చేయాలని ఆదేశించింది. ఈ మేరకు బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం తెలిపింది. వైద్యం అందక జెనీలా మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ న్యాయవాదులు కరణం కిషోర్‌కుమార్, శ్రీనిత పూజారి వేర్వేరుగా రాసిన లేఖలను ధర్మాసనం ప్రజాహిత వ్యాజ్యాలుగా పరిగణించింది. ఆరుగురు వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లుగా ప్రభుత్వం నియమించిన ముగ్గురు ప్రొఫెసర్ల కమిటీ తేల్చిందని ఏజీ చెప్పారు.

ఆ నివేదికను పరిశీలించిన ధర్మాసనం, వైద్యం చేసేందుకు నిరాకరించినట్లుగా తేలినప్పుడు ఎఫ్‌ఐఆర్‌ ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించింది. తదుపరి విచారణలోగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసేదీ లేనిదీ తెలియజేయాలని ఆదేశించింది. గర్భిణీలకు వైద్యం అందిం చాలని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చినా జెనీలాకు కరోనా ఉందేమోనన్న భయంతో చికిత్స చేయని వైద్యులపై తీసుకున్న చర్యలు రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఈ కేసులో కోర్టుకు సహాయకారిగా (అమికస్‌క్యూరీ) మాజీ వైద్యాధికారి లేదా గాంధీ/ఉస్మానియా ఆస్పత్రుల సూపరింటెండెంట్లను నియమిస్తామని ప్రకటించింది. విచారణను జూన్‌ 10కి వాయిదా వేసింది.