https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/28/stock.jpg?itok=rlYLdw0-

బ్యాంక్‌.. బాజా!



బ్యాంక్, ఆర్థిక రంగ షేర్ల జోరుతో బుధవారం స్టాక్‌ మార్కెట్‌ భారీగా లాభపడింది. ప్రపంచ మార్కెట్లు లాభపడటం, మే నెల డెరివేటివ్‌ కాంట్రాక్టులు మరో రెండు రోజుల్లో ముగియనుండటంతో షార్ట్‌ కవరింగ్‌ కొనుగోళ్లు జరగడం సానుకూల ప్రభావం చూపించాయి. మూడు రోజుల నష్టాలకు బ్రేక్‌ పడింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 31,000 పాయింట్లపైకి, నిఫ్టీ 9,300 పాయింట్లపైకి ఎగిశాయి. కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ, బ్యాంక్, ఆర్థిక రంగ షేర్లలో వేల్యూ బయింగ్‌ చోటు చేసుకోవడంతో మన మార్కెట్‌ ముందుకే దూసుకుపోయింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 996 పాయింట్ల లాభంతో 31,605 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 286 పాయింట్లు పెరిగి 9,315 పాయింట్ల వద్ద ముగిశాయి. ఈ రెండు సూచీలు చెరో 3 శాతం మేర పెరిగాయి.  స్టాక్‌ సూచీలకు ఈ నెలలో ఇదే అత్యధిక లాభం.  

1,135 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్‌....
సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల్లోనే మొదలయ్యాయి. అరగంటకే నష్టాల్లోకి జారిపోయాయి. మళ్లీ అరగంటలోనే లాభాల్లోకి వచ్చాయి. ఆ తర్వాత అంతకంతకూ లాభాలు పెరుగుతూనే పోయాయి. ఒక దశలో 83 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌ మరో దశలో 1,052 పాయింట్లు లాభపడింది. మొత్తం మీద రోజంతా 1,135 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. ఇక నిఫ్టీ బ్యాంక్‌సూచీ 1,270 పాయింట్లు (7 శాతం)ఎగసి 18,711 పాయింట్లకు చేరింది. వాహన, ఐటీ, లోహ షేర్లు లాభపడ్డాయి. లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపు, వ్యాపార కార్యకలాపాలు క్రమంగా పుంజుకోవడంతో రికవరీపై ఆశలతో మార్కెట్‌ దూసుకుపోయిందని నిపుణులంటున్నారు.  

మరిన్ని విశేషాలు...
► యాక్సిస్‌ బ్యాంక్‌ 13 శాతం లాభంతో రూ.387 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్‌ ఇదే. ఈ బ్యాంక్‌లో అంతర్జాతీయ ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ, కార్లైల్‌ 8 శాతం మేర వాటా కోసం వంద కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టనున్నదన్న వార్తలతో ఈ షేర్‌ జోరుగా పెరిగింది.  
► పలు బ్యాంక్‌ షేర్లు మంచి లాభాలు సాధించాయి. ఈ షేర్లు ఒక్క రోజులో ఈ రేంజ్‌లో లాభపడటం గత రెండు నెలల్లో ఇదే మొదటిసారి.  
► దాదాపు వందకు పైగా షేర్లు ఇంట్రాడేలో ఏడాది కనిష్ట స్థాయిలకు ఎగిశాయి. బజాజ్‌ ఫిన్‌సర్వ్, బజాజ్‌ ఫైనాన్స్, ఏబీబీ ఇండియా, ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్, పీఎఫ్‌సీ, కర్నాటక బ్యాంక్‌ షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.
► క్యూఐపీ ద్వారా రూ.7,500 కోట్లు సమీకరించనుండటంతో కోటక్‌  బ్యాంక్‌ షేర్‌ 5% లాభంతో రూ.1,216 వద్ద ముగిసింది.

లక్షల కోట్లు పెరిగిన సంపద
సెన్సెక్స్‌ భారీ లాభాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ. 2 లక్షల కోట్ల మేర పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ రూ. 2.01 లక్షల కోట్ల మేర పెరిగి రూ.124 లక్షల కోట్లకు ఎగసింది.

లాభాలు ఎందుకంటే...
► లాక్‌డౌన్‌ సడలింపులు!
వివిధ దేశాల్లో లాక్‌డౌన్‌ సడలింపులు, వ్యాపార కార్యకలాపాలు క్రమంగా సాధారణ స్థాయికి వస్తుండటంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ బలపడింది. త్వరలోనే ఆర్థిక వ్యవస్థ రికవరీ బాట పడుతుందనే అంచనాలతో కొనుగోళ్లు జోరుగా సాగాయి. ఈ ఏడాది జూన్‌ తర్వాత   భారత్‌ పటిష్టమైన రికవరీని సాధించగలదన్న జేపీ మోర్గాన్‌ సంస్థ వ్యాఖ్యానం సానుకూల ప్రభావం చూపించింది.  

► వేల్యూ బయింగ్‌...
మొండి బకాయిలు పెరుగుతాయనే భయాలతో ఇటీవల పలు బ్యాంక్, ఆర్థిక రంగ షేర్లు బాగా నష్టపోయాయి. ఇవి ఆకర్షణీయ ధరల్లో ఉండటంతో సంస్థాగత ఇన్వెస్టర్లు బ్యాంక్, ఆర్థిక రంగ షేర్లను జోరుగా కొనుగోలు చేశారు.  

షార్ట్‌ కవరింగ్‌....
మే నెల డెరివేటివ్స్‌ కాంట్రాక్టులు మరో రెండు రోజుల్లో ముగియనుండటంతో ట్రేడర్లు జోరుగా షార్ట్‌కవరింగ్‌ కొనుగోళ్లు జరిపారు. బ్యాంక్, ఎన్‌బీఎఫ్‌సీల్లో ఈ కొనుగోళ్లు అధికంగా కనిపించాయి.  

► లాభాల్లో ప్రపంచ మార్కెట్లు...
వివిధ దేశాల్లో లాక్‌డౌన్‌ను సడలించడం, పలు దేశాల్లో మెల్లమెల్లగా సాధారణ స్థితి నెలకొనడం, యూరప్‌ కేంద్ర బ్యాంక్‌ ఉద్దీపన చర్యలను ప్రకటించనుండటంతో ప్రపంచ మార్కెట్లు మంచి లాభాలు సాధించాయి.  షాంఘై, హాంగ్‌కాంగ్‌ మినహా మిగిలిన ఆసియా మార్కెట్లు లాభపడగా, యూరప్‌ మార్కెట్లు 1–2 శాతం మేర లాభపడ్డాయి.

► విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు..
కరోనా వైరస్‌ కల్లోలం నేపథ్యంలో మన మార్కెట్లో ఇప్పటివరకూ అయినకాడికి అమ్మకాలు సాగిస్తున్న విదేశీ ఇన్వెస్టర్లు మంగళవారం రూ.4,716 కోట్ల మేర నికర కొనుగోళ్లు జరిపారు.