https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/28/covid.jpg?itok=Yy-Q10YN

వంద దాటిన కేసులు



సాక్షి, హైదరాబాద్ ‌: రాష్ట్రంలో భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజే 107 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు నిర్ధారణ అయింది. అయితే మన రాష్ట్రానికి ఏమాత్రం సంబంధం లేని కేసులు తోడవడంతో కేసుల సంఖ్య భారీగా పెరిగింది. బుధవారం విడుదల చేసిన వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్‌ ప్రకారం తెలంగాణకు చెందిన 39 మందికి కరోనా పాజిటివ్‌ రాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 19 మంది వలసదారులకు పాజిటివ్‌ నిర్ధారణ అయింది. సౌదీ అరేబియాలో ఖైదీలుగా ఉంటున్న బిహార్, ఉత్తరప్రదేశ్‌ తదితర రాష్ట్రాలకు చెందిన 49 మందికి కరోనా సోకినట్లు ప్రజారోగ్య డైరెక్టర్‌ శ్రీనివాస్‌రావు తెలిపారు. దీంతో రాష్ట్రంలో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 2,098కి చేరుకుంది. ఇక బుధవారం ఒక్కరోజే ఆరుగురు చనిపోయారు. దీంతో మరణాల సంఖ్య 63కు చేరుకుంది. ఇప్పటివరకు 1,321 మంది డిశ్చార్జి కాగా, ప్రస్తుతం ఆసుపత్రుల్లో 714 మంది చికిత్స పొందుతున్నారని ఆయన తెలిపారు.  కాగా, బతుకుదెరువు కోసం    మిగతా 2వ పేజీలో u

దుబాయ్‌ వెళ్లిన ఓ యువకుడు.. అక్కడి నుంచి హైదరాబాద్‌ వచ్చిన తర్వాత కరోనాతో మృతి చెందాడు. కుటుంబసభ్యులు అందుబాటులో లేకపోవడంతో స్థానిక పోలీసులు, జీహెచ్‌ఎంసీ సిబ్బంది సహకారంతో మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన బల్లు(35) వెల్డింగ్‌ పనులు చేస్తుంటాడు. స్థానికంగా ఉపాధి అవకాశాలు లేకపోవడంతో సౌదీ వెళ్లాడు. కరోనా నేపథ్యంలో అక్కడ కూడా పనులు లేక భారత్‌కు వచ్చాడు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లోని విమానాశ్రయాలను మూసేయడంతో వేరే రాష్ట్రాలకు చెందిన వారిని కూడా శంషాబాద్‌ విమానాశ్రయానికే వస్తున్నారు. ఈ నేపథ్యంలో బల్లు ఈనెల 23న సౌదీ నుంచి శంషాబాద్‌కు వచ్చాడు. అతడిని ఎన్‌ఎస్‌జీ క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు. అప్పటికే జ్వరంతో బాధపడుతున్న బల్లు.. ఆ విషయం తెలియకుండా ఉండేందుకు పారాసిటమాల్‌ ట్యాబ్లెట్‌ వేసుకోవడంతో ఎయిర్‌పోర్టులో ఉష్ణోగ్రత తక్కువగానే ఉంది. ఆ తర్వాత రెండు రోజులకే దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలు బయటపడటంతో చికిత్స కోసం కింగ్‌కోఠి ఆస్పత్రికి తరలించి పరీక్షలు చేయగా, పాజిటివ్‌ వచ్చింది. గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా బుధవారం మృతి చెందాడు. 

జియాగూడలో 9 మందికి కరోనా.. 
జియాగూడ డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో 9 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జియాగూడలోని ఇందిరానగర్‌లో ఓ వ్యక్తి (50), మక్బరాలో వృద్ధురాలు (70), లక్ష్మీనరసింహానగర్‌లో బాలుడు (13)లకు కరోనా సోకింది. భరత్‌నగర్‌లో భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలకు వైరస్‌ సోకింది. కుల్సుంపురా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మరో కానిస్టేబుల్‌(40)కు కూడా కరోనా పాజిటివ్‌ వచ్చింది. గుడిమల్కాపూర్‌లోని కూరగాయలు కొని సబ్జిమండిలో అమ్మే ఓ వృద్ధురాలి(65)కి కూడా పాజిటివ్‌ వచ్చింది. 

4 నెలల చిన్నారికి కరోనా 
తలాబ్‌కట్టా ఆమన్‌నగర్‌–బి ప్రాంతానికి చెందిన నాలుగు నెలల బాలికకు కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. గత 3 నెలలుగా గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న పాపకు కుటుంబసభ్యులు నిలోఫర్‌ ఆసుపత్రిలో చికిత్సలు చేయిస్తున్నారు. గత 4 రోజులుగా తీవ్రమైన జ్వరం రావడంతో వైద్యులు పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా మంగళవారం రాత్రి నిర్ధారించారు. 

సూర్యాపేట జిల్లాలో కరోనా తొలి మరణం 
సూర్యాపేట రూరల్‌: సూర్యాపేట జిల్లాలో తొలి కరోనా మరణం నమోదైంది. సూర్యాపేట మండలం కాసరబాద గ్రామంలో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన నాలుగు నెలల బాలుడు సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం మృతి చెందినట్లు జిల్లా వైద్య శాఖ పేర్కొంది. బాబు పుట్టినప్పుడే గుండెకు రంధ్రం ఉండటంతో పాటు కరోనా కూడా సోకడంతో మృతి చెందాడు. జిల్లాలో ఇప్పటివరకు 84 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.  

హైదరాబాద్‌ ఆర్మీ క్యాంపులో సౌదీ ఖైదీలు
సౌదీఅరేబియాలోని జైళ్లలో మగ్గుతున్న 458 ఖైదీలను తెలంగాణలోని ఎయిర్‌ఫోర్స్, ఆర్మీ క్యాంపుల్లో కేంద్రం క్వారంటైన్‌ చేసింది. మూడు రోజుల కింద వారందరినీ విమానాల్లో తీసుకొచ్చింది. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఏరియాల్లో ఉంచింది. వారికి సౌదీలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించకుండానే ఇక్కడకు తరలించడంతో తెలంగాణ ప్రభుత్వం కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తోంది. బుధవారం నాటికి 258 మందికి పరీక్షలు నిర్వహించగా, ఇంతకుముందే 45 మందికి కరోనా నిర్ధారణ అయిందని శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం మరో 49 మందికి పాజిటివ్‌ వచ్చిందన్నారు. మొత్తం వీరిలో ఇప్పటివరకు 94 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని వెల్లడించారు. మరో 200 మందికి కరోనా పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఒడిశా, బిహార్‌ తదితర రాష్ట్రాల నుంచి వలసదారులు వచ్చారని పేర్కొన్నారు. అలా వచ్చిన వల సల ద్వారా ఇప్పటివరకు రాష్ట్రంలో 173 మందికి పాజిటివ్‌ వచ్చిందన్నారు. అలాగే విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా ఇప్పటివరకు 30 మందికి పాజిటివ్‌ వచ్చిందని శ్రీనివాసరావు వెల్లడించారు. ఇక గత 14 రోజులుగా రాష్ట్రంలో 20 జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని తెలిపారు.