ఆమెను వింటున్నామా?
‘సమస్య ముందు నుంచీ ఉంది. ఇప్పుడు ఎక్కువైంది’ అని గుసగుసగా కంగారుగా చెబుతుంది అవతలి కంఠం ‘లిజన్ టు హర్’ షార్ట్‌ఫిల్మ్‌లో ఫోన్ ఎత్తిన నందితా దాస్‌తో. ఈ షార్ట్ ఫిల్మ్‌లో నందితా దాస్ ఒక వర్కింగ్ ఉమన్. ‘లాక్‌డౌన్’ వల్ల ఇంట్లో నుంచి ఉద్యోగం చేస్తూ ఉంటుంది. వీడియో కాన్ఫరెన్స్ లో ఉంటుంది. కాని పిల్లవాడు మాటిమాటికి వచ్చి ఏదో ఒకటి అడుగుతుంటాడు. భర్త మరో గదిలో పెద్ద సౌండ్‌తో వీడియో గేమ్స్ ఆడుతుంటాడు. మధ్యలో కాఫీ అడుగుతుంటాడు. ఇద్దరూ ఆమెను పని చేసుకోనిస్తే కదా. ఈ హడావిడిలో ఎలాగోలా వీడియో కాన్ఫెరెన్స్ మాట్లాడుతూ ఉంటే ఏదో ఒక అపరిచిత నంబర్ నుంచి ఫోన్ వస్తుంది. ‘సఖి ఆర్గనైజేషన్’ కావాలి అవతలి వాళ్లకు. కాని రాంగ్ నంబర్‌గా నందితా దాస్‌కు వస్తుంది.
‘ఏవండి.. నాకు హెల్ప్ కావాలి. ఇంట్లో నా భర్త నన్ను హింసిస్తున్నాడు’ చిన్న గొంతుతో హడావిడిగా చెప్పబోతుంది అవతలి ఆమె. కాని ఇంతలో ఆమె భర్త తలుపు కొడుతుంటాడు. ఫోన్ ఆన్ లోనే ఉంటుంది. ఆమె వెళ్లి తలుపు తీసిన వెంటనే ‘ఇలానా వొండేది. నేనే దీనిని తినాలా’ అని కొట్టడం మొదలెడతాడు. చిన్న పిల్ల ఉన్నట్టుంది ఆ చిన్నారి కూడా ఏడుపు అందుకుంది. ఫోన్ ఇటువైపు పట్టుకొని ఉన్న నందితా దాస్‌కే కాదు చూస్తున్న ప్రేక్షకులకు కూడా గుండెలు వేగంగా కొట్టుకుంటాయి. ఎలాగోలా వెళ్లి ఆ కొట్టడాన్ని ఆపాలని అనిపిస్తుంది.
నందితాదాస్ పోలీసులకు ఫోన్ చేస్తుంది. వాళ్లు నిర్లక్ష్యంగా ఉంటారు. ఆ దెబ్బలు తిన్న ఆమె మళ్లీ ఫోన్ చేస్తుంది. ‘ఉదయం సరుకుల కోసం వెళ్లి మూడు గంటలు క్యూలో చిక్కుకుపోయాను. వచ్చినప్పటి నుంచి కొడుతున్నాడు. నాకు సాయం కావాలి’ తన్నులు తిని గొంతు పూడుకుపోయి ఉంటుంది. పెగలని గొంతుతో గుసగుసగా మాట్లాడుతూ ఉంటుంది. నందితా దాస్ ఈసారి ఆమె కష్టం వినడానికి, ఓదార్పు ఇవ్వడానికి సిద్ధపడుతుంది. కాని ఈలోపు భర్త ఏదో ఒకదానికి అదిలిస్తూ ఉంటాడు. అతనికి జడుస్తూ ఆమె అడ్జస్ట్ అవుతున్నదని అర్థమవుతుంటుంది. ఫోన్‌కు అవతలి పక్క ఆమె తన్నులు తింటోంది. ఇవతలి పక్క ఆమె తినడం లేదు. అంతే తేడా. చివరకు తాను ఎవరితో మాట్లాడుతూ ఉందో భర్తకు తెలియకుండా ఉండేందుకు నందితా దాస్ బాత్‌రూమ్‌లోకి వెళ్లడంతో షార్ట్‌ఫిల్మ్ ముగుస్తుంది.
‘గుసగుసగా చెప్పు. బయటకు చెప్పు. అరచి చెప్పు. కాని ఎలాగోలా చెప్పు’ అనే సందేశం ఇస్తుంది ఈ షార్ట్ ఫిల్మ్. లాక్‌డౌన్ సమయంలో గృహహింస పెరిగిందని జాతీయ మహిళా కమిషన్ వెల్లడించింది. దాని గురించి ఫిర్యాదు చేస్తున్నవారి కంటే మౌనంగా భరిస్తున్నవారి సంఖ్య అధికంగా ఉంటుందని కూడా వ్యాఖ్యానించింది. గృహహింస ఎదుర్కొంటున్నవారు మౌనంగా భరించాల్సిన పని లేదని ఎవరికో ఒకరికి చెప్పుకుని ఊరట చెందాలని, సహాయం కోరాలని, ఫిర్యాదు చేయాలని ఈ షార్ట్ ఫిల్మ్ చెబుతోంది. నందితా దాస్ తాను నటించి, నిర్మించి, దర్శకత్వం వహించిన 7 నిమిషాల ఈ షార్ట్‌ఫిల్మ్ యూ ట్యూబ్‌లో ఉంది చూడండి.